మనిషిని చంపిన గొర్రెకు మూడేళ్ల జైలు

ఇది సాధ్యమా.. అంటే సాధ్యమే అని నిరూపితమైంది. ఓ మహిళ ప్రాణాలు తీసినందుకు ఆ గొర్రెకు ఓ కోర్టులో శిక్ష విధించారు. ఇదే కేసులో బాధిత కుటుంబానికి పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చారు.

శిక్షాకాలం పూర్తయ్యాక గొర్రె భవిష్యత్ నూ నిర్ణయించారు. అది ఎక్కడ, ఎలా, ఏమి జరిగిందో.. అన్న ఆసక్తికర విషయాన్ని తెలుసుకుందాం రండి..

దక్షిణ సూడాన్ దేశంలో ఓ గొర్రె అదీయు చాపింగ్ అనే 45 ఏళ్ల వయసున్న మహిళను పదేపదే పొడిచింది. దీంతో ఆమె పక్కటెముకలు విరిగి చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటనపై ఆమె కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. ఈ మేరకు పోలీసులు గొర్రెను అదుపులోకి తీసుకున్నారు. యజమాని అమాయకుడని, కేవలం గొర్రెపైనే వారు కేసు పెట్టారు.

ఈ కేసు విషయమై పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఆ గొర్రెకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. గొర్రె యజమాని దుయోని మాన్యాంగ్ దాల్ నిర్దోషి అని ప్రకటించిన కోర్టు బారీగా జరిమానా వేసింది. బాధిత కుటుంబానికి గొర్రె యజమాని 5 ఆవులను అప్పగించాలని తీర్పునిచ్చింది. ఈ మూడేళ్ల పాటు గొర్రెను అడ్యూల్ కౌంటీలోని మిలటరీ క్యాంపులో ఉంచనున్నారు.

మరో విశేషమేమిటంటే గొర్రెకు శిక్షాకాలం పూర్తయ్యాక దానిని బాధిత కుటుంబానికి పరిహారంగా ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసింది. అదన్నమాట.. చట్టమంటే.. న్యాయమంటే.. ఇదో విచిత్రమే కదా.