తల్లితో కలిసి ఎడ్లబండిపై ప్రయాణం
బోనకల్: అత్తింటి వేధింపులు తట్టుకోలేక పుట్టింటికి వచ్చిన చెల్లిని చూసి కుమిలిపోయాడా అన్న. కుటుంబ సభ్యులతో కలిసి పోరాడినా తమ రాష్ట్రంలో న్యాయం దొరకదన్న ఆవేదనతో తల్లితో కలిసి ఎడ్ల బండిపై దేశ రాజధాని ఢిల్లీకి బయల్దేరాడు.
ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ముప్పాళ్ల గ్రామ యువకుడు నేలవెల్లి నాగదుర్గారావు వ్యథ ఇది. తన సోదరికి న్యాయం చేయాలని వేడుకుంటూ ఈ నెల 23న తల్లి జ్యోతితో కలిసి ఢిల్లీ యాత్ర ప్రారంభించాడు. మంగళవారం సాయంత్రం ఖమ్మం జిల్లా బోనకల్ గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడుతూ………
తన సోదరి నవ్యతను అదే మండలంలోని చందాపురం గ్రామానికి చెందిన కొంగర నరేంద్రనాథ్‌కిచ్చి 2018లో వివాహం చేశామని చెప్పాడు. కట్నంగా రూ.23 లక్షల నగదు, 320 గ్రాముల బంగారం, 3 ఎకరాల పొలం ఇచ్చామని తెలిపాడు.
పెళ్లి తర్వాత భర్త సక్రమంగా లేడని, పైగా అత్తింటివారు నవ్యతను బెదిరించి తెల్లకాగితాలపై సంతకాలు చేయించుకున్నారని, ఆ తర్వాత ఆమెను వేధిస్తుండడంతో పుట్టింటికి వచ్చేసిందన్నాడు.
జరిగిన ఘటన గురించి చందర్లపాడు పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్నారని నవ్యత అత్తమామలు తమ పరపతి ఉపయోగించడంతో కేసులో ఎలాంటి పురోగతీ లేకపోయిందని వాపోయాడు. దీంతో విసిగిపోయిన తాను ఇక తమకు ఏపీలో న్యాయం దొరకదని భావించి, తన తల్లితో కలిసి ఎడ్లబండిపై ఢిల్లీ చేరుకుని సుప్రీంకోర్టు, హెచ్‌ఆర్‌సీలో ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు.