అమెరికాలో మరో అమానుషం

అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం సృష్టించాయి. ఇటీవలే జరిగిన కాల్పుల ఘటనను మరువకముందే మరో ఘటన చోటుచేసుకొంది. ఇలా తరచూ కాల్పులతో ఆ దేశం హడలెత్తిపోతోంది. ఎక్కడ, ఎప్పుడు, ఏ వైపు నుంచి కాల్పుల ముప్పు పొంచి ఉంటుందోనని బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి దాపురించింది.

తాజాగా ఓ ఎలిమెంటరీ పాఠశాలలో జరిగిన ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. టెక్సాస్ పరిధిలో మెక్సికన్ సరిహద్దులో గల ఉవాల్టే పట్టణంలోని ఓ పాఠశాల విద్యార్థులపై దుండగుడు కాల్పులు జరిపాడు.

పద్దెనిమిదేళ్ల వయసున్న ఆ దుండగుడి కాల్పుల్లో సుమారు 18 మంది విద్యార్థులు చనిపోయారు. మరో ముగ్గురు టీచర్లు బలయ్యారు. అనంతరం పోలీసుల కాల్పుల్లో దుండగుడు చనిపోయాడు. చనిపోయిన విద్యార్థులు నాలుగేళ్ల వయసు నుంచి 11 ఏళ్ల వయసు వరకు ఉన్నారు.

గత కొన్నేళ్లలో ఇది ఘోర దుర్ఘటన అని ఆ దేశ మీడియా పేర్కొనగా, ఇది అత్యంత ఘోరమైన ఘటన అని ఆ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబాట్ వెల్లడించారు. ఈఘటనపై ఆదేశాధ్యక్షుడు బైడెన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా జెండాను అవనతం చేయాలని ఆదేశాలిచ్చారు.