రగిలిన కోనసీమ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమ ప్రాంతం అట్టుడుకుతోంది. కోనసీమ జిల్లా పేరును మార్చడాన్ని నిరసిస్తూ చేపట్టిన ఆందోళన తీవ్రరూపం దాల్చింది. మంత్రి, ఎమ్మెల్యే ఇళ్ల దహనంతో పాటు పలు వాహనాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టే స్థాయికి ఆందోళన తీవ్రరూపం దాల్చింది.

కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తం
జిల్లా పేరును మార్చడాన్ని నిరసిస్తూ కోనసీమ సాధన సమితి పిలుపుమేరకు ఆందోళనకారులు మంగళవారం కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళనను అడ్డుకునేందుకు పోలీసులు విశ్వప్రయత్నం చేశారు.

ఎస్పీ వాహనంపై రాళ్లు
పోలీసులను ఛేదించుకొని ఆందోళనకారులు కలెక్టరేట్ వరకు చేరుకున్నారు. వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించిన పోలీసులపైకి ఆందోళనకారులు తిరగబడ్డారు. ఈ సమయంలో జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి వాహనంపై రాళ్లు రువ్వారు.

ఎస్పీ గన్ మన్ కు గాయాలు
ఈ దాడిలో ఎస్పీ గన్ మెన్ కు గాయాలయ్యాయి. ఆందోళనకారులను చెదరగొడుతూ అమలాపురం డీఎస్పీ సొమ్మసిల్లి పడిపోయారు.

మంత్రి ఇంటికి నిప్పు
అమలాపురంలో ఆందోళన పూర్తిగా అదుపుతప్పింది. మంత్రి విశ్వరూప్ ఇంటికి ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఇంట్లో ఉన్న మూడుకార్లకు నిప్పు పెట్టారు. దాని సమీపంలో ఉన్న మూడు ఆర్టీసీ బస్సులు, ధ్వంసమయ్యాయి. కొన్ని కార్లు, పోలీసు వాహనాలకు నిప్పుపెట్టారు.

గాల్లోకి కాల్పులు
అదే విధంగా ముమ్మడివరం వైసీపీ ఎమ్మెల్యే పొన్నా సతీష్ ఇంటికి కూడా ఆందోళనకారులు నిప్పు పెట్టారు. మరోవైపు నిరసనకారులను అదుపు చేసేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఆందోళన ఎక్కడికి దారితీస్తుందోనని స్థానికుల్లో భయాందోళన నెలకొంది.