ఈ ఎస్ఐ దేశాభిమానం మామూలుగా లేదు!

రచ్చబండ, హైదరాబాద్ : బ్రిటన్ ప్రధాని రేసులో ఉన్న భారత సంతతికి చెందిన రిషి సునాక్ గెలవాలని హైదరాబాద్ లోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ షీ టీం ఎస్ఐ మేకల పోచయ్య తాపత్రయపడుతున్నాడు. ఇండియాను పాలించిన దేశంలో మనవారు నెగ్గాలని కోరుకుంటూ దేశంపై అభిమానాన్ని చాటుకుంటున్నాడు. సునాక్ గెలుపు కోసం సోమవారం వేములవాడ రాజన్న సన్నిధిలో తన తలనీలాలు సమర్పించుకున్నాడు. విదేశీ గడ్డపై భారతీయ మూలాలున్న వ్యక్తి పోటీపడటం దేశానికే గర్వకారణమంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.

ఇక్కడి దేవుళ్లు, భారతీయుల ఆశీర్వాదంతో తప్పకుండా గెలిచి బ్రిటన్ ప్రధాని పీఠాన్ని అధిష్టిస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం బ్రిటన్ ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుకుంది. ప్రధాని పదవి కోసం పోటీపడుతున్న రిషి సునాక్.. ఆయన ప్రధాన ప్రత్యర్థి లిజ్ ట్రస్ పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం లోపు కన్సర్వేటివ్ పార్టీ నేతలు బ్రిటన్ తదుపరి ప్రధానిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈ ఎన్నికల్లో గెలిచే వ్యక్తే కన్సర్వేటివ్ పార్టీనీ ముందుండి నడిపిస్తారు.