సీఎం కేసీఆర్‌ను ఫాం హౌస్‌కే పరిమితం చేద్దాం
• రోజూ సచివాలయానికి వెళ్లే సీఎంను చూస్తారు
• తెలంగాణలో జాతీయ రహదారులకు పెద్దపీట
• కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి
• మైసిగండి ఆలయంలో ప్రత్యేక పూజలు
రచ్చబండ, ఆమనగల్లు : రానున్న ఎన్నికల్లో రాష్టంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.. తెలంగాణలో ప్రతీ రోజు సచివాలయానికి వెళ్లే ముఖ్యమంత్రిని బీజేపీ ఆధ్వర్యంలో చూడబోతున్నారు.. ప్రస్తుతం సీఎం కేసీఆర్‌ను ఫామ్ హౌస్‌కే పరిమితం చేసేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధమాయ్యారు.. అని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
రంగారెడ్డి జిల్లా కడ్తాల్, ఆమనగల్లు మండల కేంద్రాల్లో ఆయన మంగళవారం పర్యటించారు. మైసిగండి మైసమ్మ ఆలయం వద్ద జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం మైసమ్మ ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమనగల్లు పట్టణంలో బృందావన్ గార్డెన్లో మీడియాతో మాట్లాడారు. ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని విఠాయిపల్లిలో తల్లోజు ఆచారితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులకు అధిక నిధులు మంజూరు చేసి రహదారులను అభివృద్ధి చేసిన ఘనత కేంద్ర ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. తెలంగాణ రాష్టంలో కుటుంబ పాలన సాగుతుందని, రాష్టంలో అనేక అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే రాష్ట్ర సీఎం తామే చేస్తున్నట్లు గొప్పలు చెప్పడం సరికాదన్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి అనేక ప్రాంతాలకు రహదారుల అభివృద్ధికి కేంద్రం నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. కల్వకుర్తి నుంచి కొల్లాపూర్ మీదగా ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని కర్వెన వరకు కొత్త జాతీయ రహదారి ఏర్పాటుకు నిధులు మంజూరు చేయడం జరిగిందని అన్నారు.
అవినీతి రాజకీయాలకు, ఫామ్ హౌస్ పాలనకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్నారు. మూడోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాగానే గిరిజనులకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తామని, రాజ్యాంగ బద్దంగా రావాల్సిన 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అనేక నిధులు కేటాయిస్తుందని, తుక్కుగూడ నుండి డిండి వరకు నాలుగు లైన్ల రహదారి కోసం రూ.1720 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు.