తెలంగాణలో బీజేపీ భారీ స్కెచ్.. సినీ తారల చేరికకు పక్కా ప్లాన్

రచ్చబండ, హైదరాబాద్ : వచ్చే సాధారణ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ తెలంగాణపై భారీ అంచనాలతో ముందుకు సాగుతోంది. ఇప్పటికే ప్రణాళిక ప్రకారం వివిధ జిల్లాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి చేరికల పర్వాన్ని వేగిరం చేసింది. మునుగోడులో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా అనంతరం పరిణామాలు వడివడిగా సాగుతున్నాయి.

బీజపీ అధిష్ఠానం సినీ తారల కోసం భారీ ప్లాన్ సిద్ధం చేసిందని సమాచారం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరిక రోజే హైదరాబాద్ లో ప్రఖ్యాత హీరో జూనియర్ ఎన్టీఆర్ తో అమిత్ షా చర్చలు జరపడం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్టీఆర్ బీజేపీలో చేరకున్నా టీడీపీలో ఉన్నా తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్లాన్ చేసినట్లు తెలిసింది.

మాజీ మంత్రి ఈటల రాజేందర్ హుజూరాబాద్ గెలుపు అనంతరం బీజేపీ దూకుడు పెంచింది. రంగారెడ్డి జిల్లా నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, వరంగల్ నుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ప్రదీప్ రావు చేరికలు ఆయా జిల్లాల్లో ప్రభావం చూపనున్నాయి.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, పదవికి రాజీనామా చేసి బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరడం రాష్ట్రంలో ఒక్కసారిగా సంచలనానికి దారితీసింది. దీంతోనే బీజేపీ తన ఆట మొదలు పెట్టింది.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరిక సందర్భంగానే సినీ నటి జీవితా రాజశేఖర్ బీజేపీలో క్రియాశీలకంగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే ప్రఖ్యాత సీనియర్ విజయశాంతి బీజేపీలో ముఖ్య భూమిక పోషిస్తున్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ ఈనెల 27న శుక్రవారం వరంగల్ నగరంలో జరగనుంది. వరంగల్ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవనున్నారు.

ఈ మేరకు ఆయన శంషాబాద్ ఎయిర్ పోర్టులో నడ్డా దిగగానే సమీపంలోని నోవాటెల్ హోటల్ కు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీ నటుడు నితిన్ తో నడ్డా సమావేశం కానున్నారు. నితిన్ తో పాటు క్రీడాకారిణి మిథాలీరాజ్ కూడా నడ్డాతో సమావేశం కానున్నట్లు తెలిసింది.

తెలుగు సినీ రంగానికి చెందిన పలువురు నటీనటులు, నిర్మాతలు, పంపిణీదారులు, దర్శకులతో ఇప్పటికే బీజేపీ టీం టచ్ లోకి వెళ్లిందని సమాచారం. వారిలో చర్చించి వరుసగా బీజేపీలోకి ఆహ్వానించనున్నట్లు తెలిసింది.