• ఇంటి అద్దె, కరెంటు బిల్లల కోసం ఒళ్లమ్ముకుంటున్న దుస్థితి
రచ్చబండ, ఆన్ లైన్ ప్రతినిధి : రవి అస్తమించని సామాజ్రాన్నేలిన ఇంగ్లండ్ దేశంలో నేడు కడు బీదరికం తాండవిస్తోంది. కనీవినీ ఎరుగని దుర్భర పరిస్థితుల్లో అక్కడి మహిళలు ఎందరో తమ కుటుంబాల జీవనం కోసం వ్యభిచార కూపంలోకి నెట్టివేయబడుతున్నారు. ఆ దేశంలోని వ్యభిచారిణులకు విముక్తి కల్పించే ఓ సంస్థ తమ నివేదికలో పేర్కొన్న కఠోర సత్యమిది.
ఇంగ్లండ్ దేశంలో ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. 40 ఏళ్ల గరిష్ఠ స్థాయికి చేరి గత జూలై నెలలో 10.01 శాతానికి ద్రవ్యోల్బణం పెరిగింది. ఇది ఆహార, ఇంధన ధరల పెరుగుదలకు కారణమైంది. నిత్యావసర ఆహార పదార్థాల వార్షిక ద్రవ్యోల్బణం జూన్ లో 9.8 శాతం నుంచి 12.7 శాతానికి పెరిగింది.
ఫలితంగా అక్కడి ప్రజల జీవనం గ్యాస్, విద్యుత్ బిల్లులు, ఇంటి అద్దెలు చెల్లించలేని స్థితికి దిగజారింది. దీంతో పెరుగుతున్న జీవన వ్యయం, పోషణ భారంతో మహిళలు వ్యభిచారం వైపు అడుగులు వేస్తున్నారని ఆ సంస్థ తెలిపింది.
ఇంగ్లండ్ దేశంలో వ్యభిచార కూపం నుంచి మహిళలకు విముక్తి కల్పించే ‘ఇంగ్లిష్ కలెక్టివ్ ప్రాస్టిట్యూట్’ అనే సంస్థ ఇచ్చిన నివేదికలో ఆందోళనకరమైన పలు విషయాలు వెల్లడయ్యాయి.
ఈ ఏడాది వేసవిలో ఆ సంస్థ హెల్ప్ లైన్ కాల్ సెంటర్ కు 33 శాతం కాల్స్ పెరిగాయని ఆ సంస్థ వెల్లడించింది. ద్రవ్యోల్పణం కారణంగా ఎందరో మహిళలు ఈ కూపంలోకి దిగాల్సి వచ్చిందని తమ నివేదికలో పేర్కొన్నది.
వ్యభిచార వృత్తిలోని మహిళలు ప్రమాదకర విటులను కలిగి ఉన్నట్లు సంస్థ తెలిపింది. విటులకు ఎలాంటి జబ్బులున్నా తప్పనిసరి పరిస్థితుల్లో మహిళలు తమ శరీరాలను అమ్ముకుంటున్నారని తెలిపింది.
అక్కడి ప్రజలు తమ పెంపుడు జంతువులకు కనీసం ఆహారం ఇవ్వలేని స్థితిలో ఉన్నారట. తాము పెంచుకుంటున్న పిల్లులు, కుక్కలకు ఆహారం కోసం కేర్ సంస్థలను ఆశ్రయిస్తున్నారని నివేదికలో తెలిపింది. ఆర్ఎస్పీఏ అనే జంతు సంరక్షణ సంస్థ గత నెలలో 19,506 పిల్లులు, కుక్కలకు ఆహారాన్ని అందించంది.
ఒక వారానికి ఒకసారి వ్యభిచారంలో పాల్గొనే ఓ మహిళ చెప్పిన విషయాలు కళ్లు బైర్లు కమ్మేలా ఉన్నాయి. తనకు ఆ వృత్తి ద్వారా వచ్చిన సొమ్ముతో ఇంటి అద్దె, విద్యుత్ బిల్లు, గ్యాస్ బిల్లు చెల్లిస్తున్నానని తెలిపింది. చూశారా.. ద్రవ్యోల్బణం ఎంతటి ధనిక దేశాన్నయినా పేదరికంలోకి నెట్టేస్తుంది.