ఎరక్కపోయి ఇరుక్కున్నాడు!

  • చోరీకి వెళ్లి కన్నంలో ఇరుక్కున్న దొంగ

దొంగలు పలు రకాలు. తమ అభిరుచికి అనుగుణంగా చోరీలకు పాల్పడుతుంటారు. దొరికితే జైలుకెళ్తారు. దొరకనంత కాలం దొరలాగా తిరుగుతారు. అయితే పోలీసుల విచారణలో తేలితే ఓ రకమైన ట్రీట్ మెంట్ ఉంటుంది. జనంలో దొరికితే మరో రకమైన ట్రీట్ మెంట్ ఉంటుంది. కానీ ఈ దొంగ విచిత్రంగా చిక్కి జనం దాడిలో చితికి.. కటకటాలు లెక్కపెట్టాల్సి వచ్చింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి దొంగతనానికి వెళ్లి విచిత్రంగా చిక్కిపోయాడు. ఎల్లమ్మ ఆలయంలో రాత్రి దొంగతనానికి బయలుదేరి వెళ్లాడు.

ఎల్లమ్మ ఆలయం గోడకు కిటికీ కోసం ఓ కన్నం ఉంది. ఎలాగైతేనేం ఎంచక్కా దానిలోంచి ఆలయంలోకి జొరబడ్డాడు. తేరగా ఆలయంలోని అమ్మవారి ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులు తస్కరించాడు. దొరలాగా అదే కన్నం నుంచి బయటకు వెళ్లేందుకు తిరిగి జొరబడ్డాడు.

వెళ్లేటప్పుడు ఎలాగో వెళ్లినా బయటకు మాత్రం రాలేక ఆ కన్నంలోనే ఇరుక్కు పోయాడు. నడుము భాగం బయటకు రాలేక అలాగే ఉండిపోయాడు. లోనికి వెళ్లలేక, బయటకు రాలేక సతమతమయ్యాడు.

ఈలోగా తెల్లారింది. గ్రామస్థులు రానే వచ్చారు. ఇంకేముంది గురుడు అట్టే దొరికిపోయాడు. గ్రామస్థులతో తన దొంగతనం గురించి వివరించాడు. గ్రామస్థులు అతడిని బయటకు లాగి స్థానిక పోలీసులకు అప్పగించారు.