Hyderabad Neera Cafe.. ట్యాంక్ బండుకెళ్దాం.. నీరా తాగొద్దాం..

  • నీరా కేఫ్ కు పెరుగుతున్న ఆదరణ
  • ట్యాంక్ బండుకొచ్చే జనం దారులు అటువైపే..
  • రుచికరమైన, బలవర్థకమైన పానీయంగా సేవనం
  • కుటుంబాల సమేతంగా వచ్చి సేవిస్తున్న జనం

రచ్చబండ, ఆన్లైన్ ప్రతినిధి : హైదరాబాద్ ట్యాంక్ బండుకు వెళ్తే లుంబినీ పార్కు, లాంచీలో ప్రయాణం, ఎన్టీఆర్ పార్కు, ఎన్టీఆర్ గార్డెన్, నెక్లెస్ రోడ్డుపై గార్డెన్లలో విహరించడం.. ఆటలాడుకోవడం..  ఇలా నగరవాసులు, పర్యాటకులు ఆస్వాదిస్తూ ఆనందిస్తుంటారు. ఇప్పుడు వీరి మెనూలో నీరా కేఫ్ మస్ట్ అయ్యింది. ట్యాంక్ బండ్ కు వచ్చిన జనమంతా ఈ కేఫ్ కు వెళ్లి నీరాను సేవిస్తూ సంతృప్తితో తిరిగి వెళ్తున్నారు.

300 ఎంఎల్ కలిగిన ఒక్కో బాటిల్ కు రూ.90 చొప్పున విక్రయిస్తున్నారు. నీరా ద్రావణంలో పలు రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉండటంతో అన్ని వర్గాల ప్రజలు, వయోబేధం లేకుండా ఆ మధుర నీరాను లాంగించేస్తున్నారు. ఎన్నడూ తాగని వారు సైతం ఇష్టంగా సేవిస్తున్నారు. మళ్లీ మళ్లీ తాగాలనిపించేలా ఉందని ఇష్టపడుతున్నారు. ఇవేకాకుండా ఇతర ఎన్నో పదార్థాలను అక్కడ అమ్ముతున్నారు. స్వీట్లు, ఐస్ క్రీమ్, బిస్కట్లు, కార తదితర తినుబండారాలను ఇష్టంగా కొనుక్కొని లాగించేస్తున్నారు.

కల్లు మండువ వోలె..

అక్కడి వాతావరణం కూడా చాలా చక్కగా రూపొందించారు. హుస్సేన్ సాగర్ నీటి అందాలు, చల్లని గాలుల పలుకరింతలు, మిరుమిట్లు గొలిపే లైటింగులు, తాటిచెట్ల నడుమ ఉన్నట్లు అనిపించేలా చెట్లు, తాటి ముంజల గుర్తులు మైమరిపిస్తుంటాయి. వాటి నడుమ కూర్చొని నీరా సేవిస్తుంటే ఆహా పల్లె కల్లు మండవలల్లో కూర్చున్నట్టే ఉంటుందని పలువురు సంబురంగా చెప్తున్నారు.

రోజుకు సుమారు 1,000కి పైగా నీరా బాటిళ్లు సేల్ అవుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. ట్యాంక్ బండే కాకుండా నగరంలో పలుచోట్ల నీరా కేఫ్ లు ఏర్పాటు చేయాలంటూ పలువురు నగరవాసులు కోరుకుంటున్నారు. కొందరు ఈ నీరా కోసం దూర ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు.