అమెరికా కొలంబస్ నగరంలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం

• ముఖ్య అతిథిగా హాజరైన వర్ధన్నపేట మాజీ తక్కెళ్లపల్లి రాజేశ్వర్ రావు

రచ్చబండ, ఆన్లైన్ ప్రతినిధి : అమెరికా ఒహియో రాష్ట్రంలోని కొలంబస్ నగరంలో బీజేపీ ఓవర్సీస్ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే తక్కెళ్లపల్లి రాజేశ్వర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

నాడు సర్ధార్ వల్లభాయ్ పటేల్ నిజాంను మెడలు వంచి 530కి పైగా సంస్థానాలను దేశంలో విలీనం చేశారని అన్నారు. నిజాం కబంద హస్తాల నుంచి తెలంగాణకు విముక్తి కల్పించారని కొనియాడారు.

నేడు నయా నిజాం కేసీఆర్ మెడలు వంచి కల్వకుంట్ల కుటుంబ కబంధ హస్తాల్లో బందీ అయిన తెలంగాణను విముక్తి చేయడమే బీజేపీ లక్ష్యమన్నారు. దాని కోసం ఈ సెప్టెంబర్ 17న తెలంగాణలో అభినవ సర్ధార్ పటేల్ అమిత్ షా తెలంగాణ గడ్డపై జాతీయ పతాకాన్ని ఎగరవేశారని అన్నారు. దీనికి తెలంగాణ ప్రజలు జేజేలు పలుకుతున్నారని అన్నారు.

బీజేపీ ఓవర్సీస్ కమిటీ నేత శ్రీనివాస్ కొంపల్లి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని సెప్టెంబర్ 17న తెలంగాణలో జాతీయ జెండాను ఎగరవేయడాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఎన్ఆర్ఐలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐలు రమేష్ మధు, శ్రీనివాస్ నిట్టూరి, మారుతీ, మహేష్ పోకల, అమర్ రెడ్డి, మనోజ్ పోకల రామకృష్ణ కాసర్ల, వెంకట్ తాళ్లపల్లి, వంశీ తదితరులు పాల్గొన్నారు.