రాచరికపు సంప్రదాయాలతో నేడు రాణి ఎలిజబెత్ అంత్యక్రియలు.. విశేషాలేంటో తెలుసా?

రచ్చబండ, ఆన్లైన్ ప్రతినిధి : బ్రిటన్ రాణి ఎలిజబెత్-2కు సోమవారం తుది వీడ్కోలు పలకనున్నారు. రాచరికపు సంప్రదాయాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. వందల ఏళ్ల నుంచి వస్తున్న ఆచార వ్యవహారాలను పాటిస్తూ రాణికి తుది వీడ్కోలు పలకనున్నారు.

రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియల కారణంగా బ్రిటన్ ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. ఈ కార్యక్రమానికి కామన్వెల్త్ దేశాల నేతలు హాజరు కానున్నారు. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు బైడెన్, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారమే బ్రిటన్ చేరుకొని రాణి భౌతికకాయానికి నివాళులర్పించారు.

బ్రిటన్ లో భారత రాష్ట్రపతి ముర్ము నూతన రాజు చార్లెస్ ను కలిసి పరామర్శించారు. బంకింగ్ హామ్ ప్యాలెస్ లో వారిద్దరూ కొద్దిసేపు ముచ్చటించారు. ఇవ్వాళ భారత ప్రభుత్వం తరుఫున ముర్ము పాల్గొననున్నారు.

రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలు అత్యంత భారీ భద్రత నడుమ జరగనున్నాయి. సుమారు 10 లక్షల మందికి పైగా పౌరులు, 2 వేల మంది వివిధ దేశాల ప్రముఖులు హాజరు కానున్నారు. లండన్ నగరమంతా భారీ భద్రతా వలయం ఏర్పాటు చేశారు.

లండన్ లో 36 కిలోమీటర్ల మేర బారికేడ్లను ఏర్పాటు చేశారు. 10 వేల మంది పోలీసులు, 6 వేల మంది సైనికులు, వేలాది మంది వలంటీర్లు, కామన్వెల్త్ దేశాలకు చెందిన సాయుధ బలగాలు పహారా కాస్తున్నాయి.

రాణి శవపేటికపై ముత్యాలు, కెంపులు, వజ్రాలు ఉంచనున్నారు. అంత్యక్రియలు తిలకించేందుకు 125 థియేటర్లలో ఏర్పాట్లు చేశారు. అదనంగా 250 రైలు సర్వీసులను ఆదేశ ప్రభుత్వం నడుపుతుంది.