రచ్చబండ, ఆన్లైన్ ప్రతినిధి : ఆయన ఓ ఆటో డ్రైవర్. 22 ఏళ్లుగా లాటరీ టికెట్లు కొంటూనే ఉన్నాడు. ఏనాడూ అదృష్టం ఆయన తలుపు తట్టలేదు. అయినా మొక్కవోని దీక్షలాగా ప్రతీసారి లాటరీ టికెట్లు కొంటూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉన్నాడు. తాజాగా ఆయనకు అదృష్ట దేవత వరించింది. వివరాలు ఏమిటో చూద్దాం రండి..
కేరళకు చెందిన అనూప్ ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ జీవనం గడిపేవాడు. ఇక్కడ జీవనానికి సరిపోను ఆదాయం లేక మలేషియాలో ఉద్యోగం చేయాలని అనుకున్నాడు.
స్నేహితుల సాయంతో అక్కడ ఉద్యోగానికి దరఖాస్తు చేశాడు. మల్లేషియా వెళ్లేందుకు రూ.3 లక్షల బ్యాంక్ లోన్ కోసం అప్లయ్ చేసుకున్నాడు.
ఇటీవల ఆ రాష్ట్రంలో జరిగిన ప్రధాన పండుగ అయిన ఓనం సందర్భంగా లక్కీ లాటరీ టికెట్లు అనూప్ కొన్నాడు. బంపర్ డ్రాలో అదృష్ట దేవత అనుప్ నే వరించింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ.25 కోట్ల లక్కీ లాటరీ తగిలింది. 22ఏళ్ల నిరీక్షణ ఫలించింది.
లక్కీ డ్రాలో అనూప్ గెలిచిన రూ.25 కోట్లకు గాను అన్ని పన్నులు పోను రూ.15.75 కోట్ల నగదు దక్కనుంది. ఇక ఆ ఇంట్లో దరిద్ర దేవత పరారు కానుందన్నమాట.
లక్కీ డ్రా వచ్చే డబ్బుతో తాను ఇల్లు కట్టుకుంటానని అనూప్ వెల్లడించాడు. మలేషియా వెళ్లేందుకు తాను దరఖాస్తు పెట్టుకున్న బ్యాంక్ లోన్ ఇక తనకు అవసరం లేదని అన్నాడు. 22ఏళ్లుగా లాటరీ టికెట్లు కొంటున్నానని, ఇప్పడు తనకు అదృష్టం వరించిందని సంతోషం వ్యక్తం చేశాడు.