వామ్మో 900 కుటుంబాల పేర్లతో భారీ శుభలేఖ!

ఇది విన్నారు.. ఈ శ్రేయోభిలాషి గురించి తెలుసుకున్నారు.. అందరూ నావాళ్లే అనుకునే ఆ ఆనందమయుడి గురించి కన్నారు.. ఊరంతా ఒకే కుటుంబం అనుకునే ఆ పరమ విధేయుడెవరో తెలుసుకోవాలని అనుకున్నారు! ఇక చదవండి.

మల్లాపురం పంచాయతీ తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లాలో ఉంది. దాని పరిధిలో ఐదు గ్రామాలు ఉన్నాయి. ఆయా గ్రామాల పరిధిలో 900 కుటుంబాలు నివాసముంటున్నాయి.

మల్లాపురం పంచాయతీకి రమేశ్ అధ్యక్షుడు. ఆయన కూతురు పేరు షాలిని. ఈనెల 24వ తేదీన ఆమె వివాహం జరిగింది. తన పంచాయతీలో ఉన్న ప్రజలంతా ఒకే కుటుంబం అన్న భావన రమేశ్ ది. వారిందరూ తనకూ కుటుంబ సభ్యులేనన్న భావనతో ఉన్నారాయన.

దీంతో షాలిని వివాహానికి ఊరిలో ఉన్న 900 కుటుంబాల్లోని భార్యాభర్తల పేర్లను చేర్చి భారీ శుభలేఖను తయారు చేయించారు. వాటిని తన ఇతర బంధు మిత్రులకు పంచిపెట్టి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు.

దీంతో మల్లాపురం పంచాయతీ ప్రజలంతా ఆయనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఒకే కుటుంబంగా ఉండాలన్న భావన రావడం మంచి సందేశమని కొనియాడుతున్నారు. ఇది తెలిసిన ఊళ్ల ప్రజలంతా పంచాయతీ అధ్యక్షుడైన రమేశ్ ను మెచ్చుకుంటున్నారు. ఇలాంటి వారు ప్రతీ ఊరిలో ఉండాలని కోరుకుంటున్నారు. మనమూ కోరుకుందామా..