ఆ రోజే బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం

రచ్చబండ, హైదరాబాద్ : బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారంటే హిందువుల్లో భక్తిభావం ఉప్పొంగుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరవాసుల్లో ఆ తల్లి అంటే ఎనలేని భక్తిభావం. సాధారణంగా ఆది, మంగళవారాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటారు.

బల్కంపేటలో ఎల్లమ్మ, పోచమ్మ జంట ఆలయాలు ఉన్నాయి. ప్రతి ఏటా ఆషాఢ బోనాల సమయంలో నిత్యం వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. నెలరోజుల పాటు ఆరోడ్డంతా భక్తులతో కిక్కిరిసి పోతుంది.

అమ్మవారి కల్యాణం రోజున ఇసుకేస్తె రాలనంత జనం తరలి వస్తారంటే అతిశయోక్తి కాదు. ఒక్క హైదరాబాద్ నగరమే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కలు తీర్చుకుంటారు.

ఈ మేరకు ఎల్లమ్మ అమ్మవారి కల్యాణ మహోత్సవ తేదీలను ఆలయ అధికారులు వెల్లడించారు. జూలై 5వ తేదీన మంగళవారం ఎల్లమ్మ అమ్మవారి కల్యాణ మహోత్సవాలు ప్రారంభమవుతాయి. మరునాడు 6వ తేదీన మహాశాంతి చండీహోమంతో కల్యాణోత్సవం పూర్తవుతుందని తెలిపారు.