కేజీ మామిడి @రూ.2.70 లక్షలు

ఇదేంటి.. ఇంత ధరేంటి.. అనుకుంటున్నారా.. అక్షరాల నిజమేనండి. అదెక్కడో కాదు మనదేశంలోనే పండింది. మామిడి పలు రకాలుగా ఉంటుందని మనకు తెలుసు. కానీ ఇంత ధర ఉన్న మామిడి తాజాగా పండి అమ్మకానికి వచ్చింది.

మామిడిలో బంగినపల్లి, తీపి మామిడి, చిన్నరసం, పెద్ద రసం, కేసరి, దసేరి, మల్లిక, నూజివీడు తదితర రకాలు సుమారు 20కి పైగానే ఉంటాయి. కానీ ఇది మాత్రం జపాన్ నుంచి తెప్పించిన మామిడి రకం. అక్కడ గతంలో పండిన ఆ మామిడి గురించి తెలుసుకున్న మన దేశ రైతు ఇక్కడికి తెప్పించి తన తోటలో పండించడం విశేషం.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్ పూర్ సమీపంలో ఓ రైతు ఏకంగా 28రకాల మామిడి పండ్లను సాగు చేస్తున్నాడు. వీటిలో జపనీస్ మియాజాకి రకం పండ్లు పండించాడు. దాని ధర ఏకంగా కిలో.2.70 లక్షలు. ఇవి బయట పర్పుల్ (ఊదా), లోపల ఎర్రటి రంగులో ఉంటాయి.

ఇదే రైతు తన తోటలో తలాల గిర్ కేసర్, కేసర్ బాదం, ఐవరీ, మాంగిఫెరా, ఆట్కిన్స్ లాంటి అరుదైన రకాల మామిడి చెట్లను పెంచుతున్నాడు.

విలువైన మామిడిని పండిస్తున్న ఈ రైతు తన తోటకు భారీ భద్రత ఏర్పాటు చేశాడు. 12 విదేశీ జాతుల శునకాలు, అడుగడుగునా సీసీ కెమెరాలతో నిత్యం పర్యవేక్షిస్తుంటారు.