• ఏడో తరగతి విద్యార్థి జవాబుతో కళ్లు బైర్లు
కొన్ని తరగతి గదుల ముచ్చట్లు మనం నవ్వుకోవడానికి పనికొస్తాయి. మరికొన్ని ఏడిపిస్తాయి. కానీ ఇక్కడ జరిగిన ఈ సంఘటన మన సమాజ స్థితిగతిని తెలియజెప్పింది. జనం బలహీనతను ఎత్తిచూపింది.
ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. ఏడో తరగతి విద్యార్థి ప్రశ్నపత్రంలో ఆశ్చర్యం కలిగించేలా వచ్చిన ఓ ప్రశ్నకు రాసిన జవాబు వైరల్ గా మారింది. విద్యార్థి రాసింది పూర్తిగా తప్పయినా అది మన కళ్ల ముందు జరుగుతున్న జుగుప్సాకరమైన దుర్నీతిని కళ్లకు కట్టినట్లయింది.
ఏడో తరగతి ఫైనల్ ఎగ్జామ్స్ సోషల్ పరీక్షలో ఓ ప్రశ్న వచ్చింది. తరగతి గదిలో చదివిన విషయాలు చదవలేదో.. గుర్తుకు లేవో.. తన కళ్లెదుట జరిగేదే నిజమనుకున్నాడో ఏమో కానీ ఓ విద్యార్థి విచిత్ర సమాధానం రాశాడు. తన ప్రత్యక్ష అనుభవాన్ని సమాధాన పత్రంలో రాసి చూపాడు.
ఎమ్మెల్యే ఎన్నికలు ఎలా జరుగుతాయి? అని ప్రశ్నపత్రంలో ఓ ప్రశ్న వచ్చింది. దానికి సమాధానంగా నిజంగా మన కళ్లెదుట ఎన్నికల్లో జరిగే విషయాలను పొందుపర్చాడు. బాలుడు రాసిన జవాబు పత్రం కింద ఉంది చూడొచ్చు.
ఆ విద్యార్థి సమాధానం ఇలా రాశాడు. 18 ఏళ్లు నిండిన వారు ఓటు వేస్తారు. ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసే వ్యక్తి ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తారు. పైసలు ఇస్తారు.. మందు బాటిళ్లు, బిర్యానీ ప్యాకెట్లు పంచుతారు.. ఆడవాళ్లకు చీరలు పంచుతారు.. అని ప్రజాస్వామ్యంలో కుళ్లును కుళ్లబొడిసినట్లు రాశాడు. భావిభారత పౌరులకు తప్పుడు సమాచారం వెళ్తున్నందున దీనితోనైనా సమాజానికి కనువిప్పు కలగాలి.