29న వీరనారి సంస్మరణ సభ

• సూర్యాపేటలో సీపీఎం ఏర్పాట్లు
• జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి, ముఖ్యుల రాక

తెలంగాణ సాయుధ పోరాటంలో వీరోచితంగా పోరాడిన యోధురాలు మల్లు స్వరాజ్యం. తన 13 ఏటే బందూకు చేతబట్టి పేదల వైపు నిలబడి రజాకార్లు, నిజాం సైన్యంపై తిరగబడ్డ వీరనారి. అంతటి త్యాగధనురాలు ఇటీవలే కన్నుమూశారు.

పోరాటాల పురిటిగడ్డ సూర్యాపేటలో ఆమెను మరోసారి స్మరించుకునేందుకు సీపీఎం ఆధ్వర్యంలో ఈనెల 29న సంస్మరణ సభ జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ సభలకు కమ్యూనిస్టు కార్యకర్తలే కాదు, అన్నివర్గాల ప్రజలు, అభ్యుదయ వాదులు, మేథావులు, కవులు, కళాకారులను ఆహ్వానించారు. ఈ మేరకు సీపీఎం కేంద్ర నాయకత్వం ఇక్కడికి రానుంది. ముఖ్యంగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, రాఘవులు, మరికొందరు ముఖ్య నేతలు రానున్నారు.

మల్లు స్వరాజ్యం సూర్యాపేట, తుంగతుర్తి కేంద్రాలుగా అనేక పోరాటాలు చేపట్టారు. తుంగతుర్తి ఎమ్మెల్యేగా సేవలందించారు. దీంతో ఆమె సూర్యాపేట జిల్లా వాసులకు సుపరిచితురాలే. ఆమె పోరాట స్ఫూర్తిని అందరూ హర్షిస్తారు. అందుకోసం పెద్ద ఎత్తున సాధారణ జనం కూడా తరలివచ్చే అవకాశ ఉంది.