పూర్వం పూర్ణాయుష్షుతో బతికేవారంట.. నూరేళ్లకు పైగా ఆరోగ్యంగా ఉండేవారంట.. బరువైన వస్తువులను ఎత్తే శక్తిమంతులంట.. అని ఇప్పటి తరం వింటూ ఉంటుంది. అప్పుడు వెంటనే మనలో ఓ ఆలోచన మెరుస్తుంది.. అప్పడేమి తినేవాళ్లో అని.. అనుకుంటుంటాం.
ఆ రహస్యాలు తెలిసినా మనం తినలేము.. చేయలేము.. ఉండలేము.. అనేది మాత్రం సత్యం. ఎందుకంటే కాలం మారింది.. తరం మారింది.. పంటలూ మారాయి.. వంటల వరుసా మారింది. అయితే అలనాటి బలవర్ధక ఆహారమైన రాగుల వల్ల ప్రయోజనాలు తెలుసుకుందాం.
రాగులు బలవర్ధకమైన ధాన్యం. నాడు రాగి సంకటి, జావ రూపంలో ఆహరంగా తీసుకునే వారు. మన పెద్దలు ఉదయాన్నే జావగా చేసుకొని పాలల్లో, మజ్జిగలో కలుపుకొని తాగేవారు. ఆనాటి తరం ఇళ్లల్లో పెంపుడు కోళ్లకు కూడా రాగులను ఆహారంగా పెట్టేవారు.
రాగుల్లోని కాల్షియం పిల్లల సక్రమ ఎదుగుదలకు తోడ్పడుతుంది. అమితపుష్టిని కలిగిస్తుంది. రాగి జావకు, రాగి సంకటికీ, వాటితో చేసిన ఇతర ఆహార పదార్థాల వల్ల శరీరానికి అంత బలం చేకూరుతుంది.
రాగుల వల్ల మన శరీరానికి కలిగే ఉపయోగాలు
1. రాగుల వల్ల జుట్టు ఎత్తుగానూ, పొడుగ్గానూ పెరుగుతుంది.
2. మధుమేహ వ్యాధికి రాగులతో చేసిన ఆహార పదార్థాలు, రాగుల గంజి, పాలల్లో కలిపిన రాగుల పానీయం చక్కని ఔషధంగా పనిచేస్తుంది.
3. రాగులు ఇతర ధాన్యాలకంటే బలవర్థకమైనవి. శారీరక కష్టం అధికంగా చేసేవారు రాగుల పిండితో తయారు చేసిన పదార్థాలను తరచూ తిన్నట్లైతే వారికి నూతన శక్తి లభిస్తుంది.
4. రాగులలో అయోడిన్ పుష్కలంగా లభిస్తుంది. ఎదిగే పిల్లలకు పాలల్లో రాగులను వేయించి పొడిచేసిన పిండిని కలిపి తాగించినట్లయితే వారి ఎదుగుదల, ఆరోగ్యం బాగుండి శక్తి లభిస్తుంది.
5. కడుపులో మంటను తగ్గించి, చలువ చేస్తుంది. పైత్యాన్ని తగ్గిస్తుంది. రాగుల పానీయం దప్పికను అరికడుతుంది.
6. వృద్ధాప్యంలో ఉన్న వారు రాగులతో తయారు చేసిన ఆహార పదార్థాలను భుజించడం వల్ల శరీరానికి బలం, శక్తి చేకూరుతాయి.
7. మహిళల్లో ఎముకల పటుత్వానికి రాగులతో తయారు చేసిన రాగి మాల్ట్ తాగడం మంచిది. రాగి మాల్ట్ ఎముకల పటుత్వానికి ధాతువుల నిర్మాణానికి తోడ్పడుతుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా చేస్తుంది.
8. సుగంధిపాలు కలిపిన రాగి మాల్టును తీసుకుంటే రక్తపోటు అరికట్టబడుతుంది.
మన పూర్వీకులు రాగులను బాగా వాడేవారు. ఆరోగ్యానికి కొండంత బాసటగా ఇవి నిలుస్తాయనేది వారి అనుభవం చెబుతోంది. అందుకే కొందరు ఇప్పటికీ రాగి జావను తాగుతుంటారు. ఇంకో గమ్మతైన విషయం ఏంటంతే కోడి పందాలు వేసే పందెం కోళ్లకు సైతం ఇవే ఎక్కువ పెడతారు. ఎందుకంటే వీటి వల్ల వచ్చే బలం చాలా ఎక్కువ. రాయలసీమలో ఈనాటికీ రాగి సంకటి ఆహరంగా వాడటం జరుగుతోంది. కానీ రాగులు చేసే ఉపయోగాలు, ఇచ్చే ఆరోగ్యం తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ వాడతారు.