నల్లగొండ జిల్లాలో విషాద ఘటన

నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండల కేంద్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు చెరువులో మునిగి ఇద్దరు మృత్యువాత పడ్డారు. దీంతో నార్కట్ పల్లి మండలంతో పాటు నల్లగొండ పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

నార్కట్ పల్లి మండల కేంద్రానికి చెందిన మెరుగు లింగయ్య (38), నారబోయిన పద్మ (44) సమీపంలోని పెద్ద చెరువులో గొర్రెలను శుభ్రం చేసేందుకు వెళ్లారు. అక్కడ చెరువులోకి దిగి గొర్రెలను శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి గల్లంతయ్యారు.

వెంటనే స్థానికులు పోగై సహాయక చర్యలు చేపట్టారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. స్థానికుల సహాయంతో ఎట్టకేలకు మృతదేహాలను వెలికి తీశారు.

వారిద్దరి మృతితో గ్రామంతో మండల వ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. నల్లగొండ జిల్లా కేంద్రంలోని జిల్లా కేంద్రాస్పత్రికి మృతదేహాలకు తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అక్కడికి తరలివచ్చిన బంధుమిత్రులతో ఆస్పత్రి ఆవరణలో విషాదం అలుముకుంది.