పాము ప్రాణం పోయిందనుకున్నారు.. పాప ప్రాణమే తీసింది!

ఇదొక విషాద ఘటన. ఆ తల్లి శోకం తీర్చలేని సంఘటన. లేకలేక పుట్టిన కన్న కొడుకు తన చేతులో ఉండగా తనువు చాలించిన దుర్ఘటన. ఆ కుటుంబానికి జీవితాంతం దు:ఖాన్ని మిగిల్చిన దుర్భర ఘటన.

ఇది ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ప్రమాదం. గ్రామంలో కనిపించిన ఓ పామును చంపేందుకు కొందరు గ్రామస్థులు కర్రలతో కొట్టారు. చలనం లేకుండా పడి ఉంది. అది చనిపోయిందనుకుని రోడ్డు పక్కనే పడేశారు.

గ్రామస్థుల చేతిలో చనిపోయిందనుకున్న ఆ పామును పలువురు గ్రామస్థులు చూడసాగారు. వారిలో ఓ మహిళ ఆ పాము దగ్గరగా వెళ్లి చూసింది. అంతే అప్పటిదాకా చలనం లేకుండా పడి ఉన్న ఆ పాము ఒక్కసారిగా తన ప్రతాపం చూపింది.

అనూహ్యంగా ఆ పాము పైకెగిరి ఆ మహిళ చంకలో ఉన్న చిన్నారి కొడుకుపై పడింది. తన కసిదీరా ఆ బాలుడిపై కాటేసింది. వెంటనే ఆ బాలుడిని సమీపంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడి డాక్టర్లు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేక ఆ చన్నారి బాలుడికి నూరేళ్లు నిండి కన్నుమూశాడు.

మరో విషాదమేమిటంటే.. ఆ బాలుడు ఆ కుటుంబంలో పెళ్లయిన 16 ఏళ్లకు పుట్టిన సంతానం. ఇన్నేళ్ల పూజా ఫలంగా జన్మించిన ఆ బాలుడు అనుకోని ఘటనలో చనిపోవడంతో ఆ కుటుంబం విషాద సాగరంలో మునిగింది. ఆ గ్రామంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి.