మేమొస్తే క్వింటా వరికి రూ.2,500

• ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ
• నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి
• ముకుందాపురానికి చేరుకున్న రైతుభరోసా యాత్ర

నేరేడుచర్ల : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే క్వింటా వరి ధాన్యానికి రూ.2,500 మద్దతు ధర చెల్లిస్తాం.. ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం.. అని నల్లగొండ ఎంపీ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పునరుద్ఘాటించారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర గురువారం నాటికి నేరేడుచర్ల మండలం ముకుందాపురం గ్రామానికి చేరుకుంది.

ఈ సందర్భంగా గ్రామంలో ఆయన పర్యటించారు. అనంతరం నిర్వహించిన రచ్చబండ సభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రసంగించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎనిమిదేళ్ల కాలంలో రైతులకు వివిధ సమస్యలు సృష్టించిందని ధ్వజమెత్తారు.

కౌలు రైతులను అసలే పట్టించుకోలేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఉన్న కాలంలో ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, ప్రభుత్వ గృహాలు ఇచ్చామని వివరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని అన్నారు. తమ ప్రభుత్వం వస్తే బలహీనవర్గాలకు ఇండ్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొణతం చిన్న వెంకట్ రెడ్డి, ముకుందాపురం గ్రామ కమిటీ అధ్యక్షుడు పగిడి నవీన్, ప్రధాన కార్యదర్శి పల్లె భాస్కర్, యూత్ అధ్యక్షుడు పోతురాజు అశోక్, కార్య నిర్వాహక అధ్యక్షుడు పగిడి నిఖిల్, నాయకులు లకుమల్ల సైదులు, పల్లె కాశయ్య తదితరులు పాల్గొన్నారు.