అమ్మకు అవమానం జరిగింది. కనిపెంచిన మాతృమూర్తిని కాదు పొమ్మన్నారు. నవ మాసాలు మోసి ఐదుగురు ఆడబిడ్డలకు జన్మనిచ్చిన ఆ తల్లిని వదిలించుకున్నారు. ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు చేసిన మాతృమూర్తిని ఇంటి నుంచే గెంటేశారు.
ఫలితంగా ఆ నిస్సహాయురాలు పంచాయతీ కార్యాలయం పంచన చేరింది. ఆమెను చేరదీసి మానవత్వాన్ని చాటారు మానవతామూర్తులు. ఇది ఎక్కడో మారుమూల గ్రామంలో కాదు ఓరుగల్లు మహానగరంలోని భట్టుపల్లి పరిధిలో చోటుచేసుకుంది.
హన్మకొండ ప్రతినిధి : హన్మకొండ పరిధిలోని భట్టుపల్లిలో పెందోట ఉపేంద్రమ్మ అనే వృద్ధురాలికి ఐదుగురు కూతుళ్లు. పిల్లలు ఆస్తి, డబ్బు తీసుకొని ఆమెను వీధిలో పడేశారు. కనీసం తిండి కూడా పెట్టకుండా ఇబ్బంది పెడుతున్నారని, భట్టుపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయ భవనంలో కొన్నాళ్లుగా ఆమె తల దాచుకుంటోంది.
విషయం తెలుసుకున్న అనురాగ్ హెల్పింగ్ సొసైటీ ప్రెసిడెంట్, సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ బెంచ్ మెంబర్ డాక్టర్ కరుకాల అనితారెడ్డి ముందుగా అక్కడికి వెళ్లి వివరాలు సేకరించారు. లార్డ్ ఆశ్రమ నిర్వాహకులు డాక్టర్ నారగాని నరేశ్ ను ఆమె ఫోన్లో సంప్రదించి వృద్ధురాలిని తన కారులో తీసుకుని వెళ్లి భీమరంలోని లార్డ్ ఆశ్రమంలో చేర్పించారు.
వృద్ధురాలి సంతానంపై కేసు : డాక్టర్ అనితారెడ్డి
వృద్ధురాలి పిల్లల వివరాలు పూర్తిగా తెలుసుకొని కేసు నమోదు చేయనున్నట్లు ఈ సందర్భంగా మాట్లాడిన అనితా రెడ్డి మాతెలిపారు. తల్లితండ్రులను వృద్ధాప్యంలో చూసుకోవడం పిల్లల బాధ్యత అని, వృద్ధులను గౌరవించి ఆదరించాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు.
సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ బెంచ్ (వృద్ధులు కోర్టు) పట్ల ప్రతీ ఒక్కరికీ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. వృద్ధులకు పిల్లలతో లేదా ఇంకా ఏ రకమైన ఇబ్బంది కలిగినా న్యాయం కోసం ట్రిబ్యునల్ బెంచికి వెళ్లి ఫిర్యాదు చేయాలని సూచించారు. లేదా 14567 టోల్ ఫ్రీ నంబర్ కు ఫిర్యాదు చేయవచ్చన్నారు.
వృద్ధులకు ఉన్న సమస్యలను పరిస్కరించుకోవడానికి ట్రిబ్యునల్ బెంచ్ ఎంతో అసరా అవుతుందని డాక్టర్ అనితా రెడ్డి తెలిపారు. లార్డ్ ఆశ్రమ నిర్వాహకులు డాక్టర్ నారగాని నరేశ్, ఏ.చంద్రమౌళి, దేవాచారి, ఫీల్డ్ ఆఫీసర్ రాజు తదితరులు పాల్గొన్నారు.