గ్యాంగ్ రేప్ కేస్ అప్ డేట్స్

హైదరాబాద్ జూబ్లీ హిల్స్ అమ్నేషియా పబ్ గ్యాంగ్ రేప్ కేసు రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ కేసు విషయంలో నిందితుల గుర్తింపు విషయంలో నెలకొన్న సందిగ్ధతకు మంగళవారం తెరపడింది. కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు.

నిందితుల్లో ఒకరు సాదుద్దీన్ కాగా మిగతా వారు మైనర్లు అని తెలిపారు. వారిందిరినీ అదుపులోకి తీసుకున్నట్లు సీపీ తెలిపారు. ఈ కేసులో ఆరో వ్యక్తి లైంగిక దాడికి పాల్పడలేదని తేల్చి చెప్పారు. కేసుకు సంబంధించి తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు.

నిందితులందరిపై పోక్సో చట్టం, గ్యాంగ్ రేప్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే నిందితులైన మైనర్ల పేర్లను వెల్లడించడం లేదని తెలిపారు. కేసుకు సంబంధించి ఇంకా ఎవరి వద్దనైనా ఆధారాలు ఉంటే తమకు సమర్పించాలని సూచించారు.

మొదట సరైన ఆధారాలు లేనందునే నిందితులను అదుపులోకి తీసుకోవడంలో జాప్యం జరిగిందని సీపీ తెలిపారు. బాధితురాలు నిందితులను గుర్తించలేకపోతోందని, సీసీ పుటేజీల ద్వారా నిందితులను గుర్తించినట్లు తెలిపారు. భరోసా సెంటర్ లో కౌన్సిలింగ్ తర్వాతే బాధితురాలు వివరాలు చెప్పిందని తెలిపారు.

ఇలా జరిగింది!
మే 28న జరిగిన లైంగిక దాడి ఘటనను సీపీ ఆనంద్ వివరించారు. 31వరకు బాధితురాలు తన ఇంట్లో చెప్పలేదని తెలిపారు. మే 28న బాలిక మధ్యాహ్నం పబ్ కు వెళ్లిందని, 3.15కు నిందితులు ఆమెను ట్రాప్ చేశారని చెప్పారు. సాయంత్రం 5.43 గంటలకు కారులో ఆమెను ఎక్కించుకొని కాన్సూ బేకరీకి బయలుదేరారని చెప్పారు.

దారిలో బాలికను ముద్దులు పెట్టుకుంటూ వీడియోలు తీసుకున్నారన్నారు. తర్వాత పెద్దమ్మ టెంపుల్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో ఐదుగురు లైంగికదాడికి పాల్పడినట్లు తెలిపారు. రాత్రి 7.30 గంటలకు బాలికను పబ్ వద్ద వదిలేసి వెళ్లారని వివరించారు.

రాష్ట్ర ఓ మంత్రి మనవడు ఈ కేసులో ఉన్నట్లు వస్తున్న వార్తలు కేవలం ఆరోపణలేనని, దర్యాప్తులో తమకు అలాంటి ఆధారాలు దొరకలేదని సీపీ వెల్లడించారు. ఆధారాలు ఉంటే ఎవరైనా సమర్పించవచ్చని తెలిపారు.