మద్యం అమ్మకాల్లో మనోళ్లు మన రాష్ట్రాన్ని రికార్డు స్థాయిలో నిలుపుతూనే ఉన్నారు. ధరలు పెరిగితేనేమి దడవడమే లేదు. కేసులకు కేసులు లాగేస్తూనే ఉన్నారు. సీసాలకు సీసాలు ఖాళీ చేస్తూనే ఉన్నారు. మరి మే నెలలో మరింతగా లాగేయడం గమనార్హం.
ఒక్క మేనెలలోనే మన రాష్ట్రంలో రూ.3 వేల కోట్ల మద్యం అమ్ముడుపోయింది. మనోళ్లు అడ్డూ అదుపు లేకుండా అంతగా తాగారన్న మాట.
రంగారెడ్డి జిల్లాలో అత్యధిక మొత్తంలో మద్యం అమ్ముడైందని లెక్కల్లో తేలింది. ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే రూ.677 కోట్ల మద్యం అమ్ముడైంది. అబ్బో ఇదీ ఓ రికార్డే.
వరంగల్, నల్లగొండ జిల్లాలు అత్యధిక మద్యం అమ్ముడైన జిల్లాల్లో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ మూడు జిల్లాలు మద్యం అమ్మకాల్లో తరచూ పోటీ పడుతుంటాయి.
మే నెల ఒకటో తారీకు నుంచి 31వ తేదీ వరకు బీర్ల అమ్మకాల లెక్క చూస్తే కళ్లు బైర్లు కమ్ముకుంటాయి. ఆ నెల రోజుల్లోనే 55.72 లక్షల బీర్ కేసులు అమ్ముడయ్యాయని తేలింది.
చూశారా.. మనోళ్లు ఎంతగా మద్యం గుంజేశారో.. ఇదన్న మాట. ప్రభుత్వానికి ఆదాయం దేవుడెరుగు ఆరోగ్యాలు పాడయ్యేలా ప్రజలు తెగ తాగుతున్నారని వాపోతుండటం మానవతావాదుల వంతయింది.