11న కాంగ్రెస్ లో చేరికలపై ఉత్కంఠ.. దూకుడు పెంచిన రేవంత్ రెడ్డి

రచ్చబండ, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో చేరికల పర్వం కొనసాగుతోంది. విడతల వారీగా చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇతర పార్టీల నుంచి చేరికలపై పార్టీ సీనియర్ల అభ్యంతరాలను సైతం రేవంత్ రెడ్డి లెక్కచేయడం లేదు. అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మరింత దూకుడు పెంచారని తెలుస్తోంది.

టీఆర్ఎస్, బీజేపీల నుంచి మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ప్రజాప్రతినిధులెందరో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. పాలమూరు జిల్లాలో జనబలం ఉన్న మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఎర్ర శేఖర్ తాజాగా రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. అంతకు ముందు పీజేఆర్ తనయ, కార్పొరేటర్ విజయారెడ్డి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఎర్ర శేఖర్, విజయారెడ్డి చేరికలపై కొందరు సీనియర్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనా రేవంత్ వెనక్కి తగ్గలేదు. సరికదా అధిష్ఠానం నుంచి భరోసా కూడా తీసుకున్నట్లు సమాచారం. పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతన్నట్లు అర్థమవుతోంది. దీంతో శ్రేణుల నుంచి కూడా సానుకూలత వ్యక్తమవుతోంది.

ఈ దశలో ఈనెల 11న కొందరు మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మహూర్తం నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వారు రేవంత్ రెడ్డితో చర్చలు జరిపినట్లు గుసగుసలు. వీరి చేరికల పైనా కొందరు సీనియర్ల అభ్యంతరాలున్నా తగ్గేదేలే.. అన్న రీతిలో రేవంత్ వారి చేరికను స్వాగతిస్తున్నట్లు సమాచారం.

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే, హైదరాబాద్ నగర మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి, నల్లగొండ జిల్లా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, మరికొందరు ముఖ్య నేతలు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది.

కాంగ్రెస్ పార్టీలో చేరికపై తీగల, వీరేశం కొట్టిపారేస్తున్నా, చేరికకే వారు మొగ్గు చూపారని సన్నిహితుల ద్వారా తెలిసింది. ఇప్పటికే తమతో వచ్చే నేతలతో వారు చర్చలు సాగిస్తున్నట్లు సమాచారం. ఆయా నియోజకవర్గాల్లో వారిద్దరూ బలమైన నేతలు కావడంతో కాంగ్రెస్ కూడా వారిని స్వాగతిస్తుందని ఆ పార్టీ నేతలే చెప్తున్నారు.

ఏదేమైనా వారు అనుకున్న ముహూర్తానికి కాంగ్రెస్ పార్టీలో చేరుతారా.. టీఆర్ఎస్ పార్టీ అధిష్ఠానం ఏదైనా హామీ ఇస్తే వెనక్కి తగ్గుతారా అన్నది వేచి చూడాలి.