రాజ్యసభ నామినేట్ సభ్యులు పీటీ ఉష, ఇళయరాజా, విజయేంద్ర ప్రసాద్, వీరేంద్ర హెగ్డే జీవన గమనం

రచ్చబండ ప్రత్యేకం : రాష్ట్రపతి కోటాలో తాజాగా నలుగురు ప్రముఖులను రాజ్యసభ సభ్యులుగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఎంపిక చేశారు. వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని దక్షిణాది నుంచే ఎంపిక చేయడం విశేషం. వారిలో క్రీడారంగం నుంచి పీటీ ఉష, సినిమా రంగం నుంచి ఇళయరాజా, సాహిత్యం విజయేంద్ర ప్రసాద్, సేవా రంగం నుంచి వీరేంద్ర హెగ్డేలను ఎంపిక చేశారు. వారంతా ఆయా రంగాల్లో అత్యున్నత సేవలందించిన వారు కావడం గమనార్హం. వారి సంక్షిప్త జీవన గమనం రచ్చబండలో మీకోసం.

పీటీ ఉష : యూఎస్ఏలోని లాస్ ఏంజిల్స్ లో 1984లో జరిగిన ఒలింపిక్స్ క్రీడా పోటీల్లో మెరిసింది మన భారత క్రీడాకారిణి పీటీ ఉష. 400 మీటర్ల పరుగు పందెం పోటీల్లో కాంస్య పతకం చేజారినా ఫైనల్ కు చేరిన మొదటి భారతీయ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. పీటీ ఉష 1964 జూన్ 27న కేరళ రాష్ట్రం కోజికోడ్ జిల్లా పయోలీలో జన్మించింది. ఆమె పూర్తి పేరు పిలావుళ్లకండి తెక్కే పరంబిల్ ఉష. 1979 నుంచి మన దేశం తరఫున అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని ఎన్నో విజయాలను అందించింది.

వివిధ ఆసియా క్రీడల్లో పలు బంగారు, రజత, కాంస్య పతకాలను మన దేశానికి తెచ్చి పెట్టింది. క్రీడల్లో ఆమె మన దేశానికి తెచ్చిన ఖ్యాతికి గుర్తుగా 1985లో భారత ప్రభుత్వం పద్మశ్రీ, అర్జున అవార్డులతో సత్కరించింది. తాజాగా రాష్ట్రపతి కోటాలో జూలై 6న రాజ్యసభ సభ్యురాలిగా పీటీ ఉష ఎంపికైంది.

ఇళయరాజా : దేశంలోని వివిధ భాషల్లో 5 వేల పాటలకు, 1,000 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించిన మేటి సంగీత దర్శకుడు ఇళయరాజా. 1943 జూన్ 2న తమిళనాడులోని మధురై జిల్లా వన్నైపురంలో ఇళయరాజా జన్మించారు. ఆయన సంగీత దర్శకత్వంతో పాటు పాటల రచయితగా, గాయకుడిగా ప్రసిద్ధి చెందారు. ఆయన ఉత్తమ సంగీత దర్శకుడిగా నాలుగు సార్లు జాతీయ అవార్డును అందుకున్నారు.

సినీ సంగీతానికి ఇళయరాజా చేసిన సంగీతానికి గాను ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు ఆయన సొంతమయ్యాయి. ఈ దశలో 2018లో భారత ప్రభుత్వం ఆయనను పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించింది. తాజాగా ఆయన రాజ్యసభకు ఎంపికయ్యారు.

విజయేంద్ర ప్రసాద్ : ప్రఖ్యాత సినీ దర్శకుడు, కథకుడు అయిన విజయేంద్ర ప్రసాద్ 1941లో ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో జన్మించారు. విజయేంద్ర ప్రసాద్ దర్శకుడిగా, కథా రచయితగా ఒక నంది అవార్డుతో పాటు పలు అవార్డులను సొంతం చేసుకున్నారు. ఇటు తెలుగు, హిందీలో రికార్డుల వర్షం కురిపించిన చిత్రాలు బాహుబలి, బజ్రంగీ బాయీజాన్, మగధీర, సమర సింహారెడ్డి, సింహాద్రి చిత్రాలకు ఈయనే కథ అందించారు.

దేశ ఖ్యాతే కాదు, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చిత్రాలైన బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాల దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి విజయేంద్ర ప్రసాద్ తనయుడే. ఈయన తాజాగా రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ అయ్యారు.

వీరేంద్ర హెగ్డే : భారతీయ పరోపకారిగా, ధర్మస్థల ఆలయ వంశపారంపర్య నిర్వాహకుడైన డి.వీరేంద్ర హెగ్డే 1948 నవంబర్ 25న కర్ణాటకలోని బంట్వాల్ లో జన్మించారు. 1968 అక్టోబర్ 24న తన 19వ ఏట ధర్మస్థల ధర్మాధికారిగా ఎన్నికైన ఆయన విశేష సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఆలయాన్ని, దాని ఆస్తులను భక్తుల ప్రయోజనానికి, ధర్మ కార్యార్థం ట్రస్టును నిర్వహిస్తూ విశేష సేవలందిస్తున్నారు.

అంతే కాకుండా అనేక రచనలకు గాను అవార్డులను అందుకున్నారు. 2009లో కర్ణాటక అత్యున్నత పౌర పురష్కారమైన కర్ణాటక రత్న అవార్డు అందుకున్నారు. 2000 సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డుతో భారత ప్రభుత్వం సత్కరించింది. ఈ కోవలో వీరేంద్ర హెగ్డేను రాష్ట్రపతి కోటా కింద రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ అయ్యారు.