రచ్చబండ, ప్రత్యేక ప్రతినిధి : సహజంగా అధికారంలో ఉన్న పార్టీకి కమ్యూనిస్టు పార్టీలు వ్యతిరేకంగా పనిచేస్తాయి. ఎందుకంటే ప్రజా సమస్యలే ఎజెండాగా పనిచేసే ఆ పార్టీలు ప్రజా పోరాటాల్లో మునిగి తేలుతాయి. దీంతో అధికార పక్షంతో వైరంతోనే ఉంటాయి. ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల కూటమిలో కానీ, ప్రధాన ప్రతిపక్షంతో కానీ స్నేహం చేయడం పరిపాటి. కానీ ఈ సారి వామపక్షాలు అధికార పక్షంతోనే జట్టు కట్టేశాయి. వచ్చే ఎన్నికల్లోనూ అదే వర్కవుట్ అయ్యే అవకాశం ఉంది.
కానీ ఈ చాన్స్ కోట్టేసే అవకాశాన్ని కాంగ్రెస్ చేజేతులా జారవిడుచుకున్నట్లయింది. ఎందుకంటే ఆలస్యం అమృతం విషం.. అన్న సామెతలాగా కాంగ్రెస్ పక్షంలో చేరాల్సిన కమ్యూనిస్టులు టీఆర్‌ఎస్ శిబిరంలో చేరిపోయాయి. ఎందుకిలా జరిగింది.. ఫలితాలెలా ఉంటాయి.. ఎవరికి లాభం.. ఎవరికి నష్టం తెలుసుకుందాం రండి..
తెలంగాణలో ప్రస్తుతం ఏ నియోజకవర్గంలో కూడా గెలిచేంత బలం వామపక్షాలకు లేదు. కానీ గెలుపోటములను ప్రభావితం చేయగలిగే శక్తి మాత్రం ఆ పార్టీలకు ఉంది. సీపీఎం, సీపీఐ రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో దీర్ఘకాలం పాటు ప్రాతినిథ్యం వహించాయి. ఆయా నియోజకవర్గాల పరిధిలో కేడర్ ఎంతో కొంత లేకపోలేదు. ఇతర చోట్ల ప్రజా పోరాటాల కారణంగా కేడర్ ఉంది. అయితే ఎన్నికల సమయంలో ఏదో ఒక కూటమి, లేదా పార్టీతో జతకట్టే వామపక్షాలు పలుమార్లు బూర్జువా పార్టీలకు అధికారాన్ని చేరువ చేయడంలో కీలక భూమిక పోషించాయి.
వివిధ ఎన్నికల్లో వేర్వేరు సమయాల్లో ప్రధాన పార్టీలైన టీడీపీ, కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలతో వామపక్షాలు జతకలిసి పోటీ చేశాయి. బీజేపీతోనే కలవలేదు. ఇక కలవనూబోరు అనేది తేటతెల్లమే.. ఈ దశలో ఇంకా సాధారణ ఎన్నికలు ఏడాదికి పైగా ఉండగానే వచ్చిన మునుగోడు ఉప ఎన్నికలో వామపక్షాలు అనూహ్యరీతిలో అధికార టీఆర్‌ఎస్ పార్టీకి మద్దతుగా నిలిచాయి. దీనికి పలు కారణాలు ఉన్నా వామపక్షాల పొత్తు అవకాశాన్ని చేజేతులా కాంగ్రెస్ వదులుకుందా.. అంటే నిజమేనని చెప్పవచ్చు.
ఇక్కడ రెండు విషయాలు చెప్పుకోవాలి. ఒకటి ఎన్టీఆర్‌తో స్నేహం. రెండు వైఎస్సార్‌కు అధికారపీఠం. మొదటిది ఎన్టీఆర్‌తో స్నేహం. 1982లో తెలుగుదేశం పార్టీ పెట్టి 1983లో జరిగిన ఎన్నికల్లోనే అధికారం దక్కించుకున్నారు ఎన్టీఆర్. ఆ తర్వాత 1985లో మధ్యంతర ఎన్నికలకు వెళ్లారు. ఇక అప్పటి నుంచి వామపక్ష పార్టీలకు స్నేహహస్తం అందించారు. సహజంగా వామపక్షాలు కాంగ్రెస్ వ్యతిరేకతతో ఉన్నాయి. అదే అంశంపై ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారు. ఈ ఒక్క అంశం వారిని ఒక్కటి చేసింది.
అది మొదలు 1995 సెప్టెంబర్ 1న ఎన్టీఆర్ పదవీచ్యుతుడయ్యేంత వరకూ తెలుగుదేశం పార్టీతోనే వామపక్ష పార్టీలు కలిసి ఉన్నాయి. ఎన్టీఆర్ కూడా వామపక్ష నేతలతో సోదరభావంతో ఉంటూ వచ్చేవారు. వారు అడిగినన్ని సీట్లిచ్చి వారిని గౌరవించేవారు. టీడీపీ, వామపక్ష పార్టీల కేడర్‌లోనూ ఒక పార్టీపై మరొక పార్టీకి సహజంగా సానుభూతి పెరిగింది. వారూ స్నేహభావంతోనే ఉండేవారు. ఎన్టీఆర్ కూడా వామపక్ష నేతల నుంచి పలు సూచనలు, సలహాలు స్వీకరించేవారు. ఎన్టీఆర్ ప్రభకు వామపక్షాల బలం ఆయన అధికారంలో ఉండటానికి ఎంతోకొంత దోహదపడింది.
ఇక రెండోది.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2004లో ముఖ్యమంత్రి అయ్యారు. ఈ విషయంలో వామపక్షాలు, ముఖ్యంగా సీపీఎం పోరాటం ఎంతోకొంత దోహదపడిందనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. టీడీపీతో దోస్తీగా ఉన్న వామపక్షాలు టీడీపీ, పాలనా పగ్గాలు చేపట్టిన చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకించాయి. చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ బీజేపీతో జతకట్టడం, రాష్ట్రంలో క్యాపిటేషన్ ఫీజు, విద్యుత్ చార్జీలు, బస్ చార్జీల పెంపు, ప్రభుత్వ, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల పెంచాలని తిరుగుబాటు చేశాయి.
ఆయా అంశాలపై పలుమార్లు వామపక్షాలు అలుపెరగని పోరాటాలు చేశాయి. ముఖ్యంగా విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ సీపీఎం చేపట్టిన ఉద్యమం 2004లో తారాస్థాయికి చేరుకుంది. అంగన్‌వాడీల పోరాటం ఉధృతంగా సాగింది. సీపీఎం, సీపీఐ, ఇతర వామపక్షాలు పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, పింఛన్లు తదితర అంశాలపై నిరంతర పోరాటాలు చేశాయి. ఫలితంగా చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెరిగింది.
అదే సమయంలో కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టి ప్రజలకు భరోసా కల్పించారు. కాంగ్రెస్ పార్టీ చాకచక్యంగా వామపక్ష పార్టీలు చేపడుతున్న ఉద్యమాల్లో భాగస్వామ్యమైంది. పర్యవసానంగా కాంగ్రెస్ పార్టీతో వామపక్షాలకు పొత్తు పొడిచింది. దీంతో ఆనాటి చంద్రబాబు ప్రభుత్వాన్ని ఓడించేందుకు, వైఎస్సార్‌ను ముఖ్యమంత్రిని చేయడంలో వామపక్షాల పాత్ర కూడా ప్రబలంగా ఉంది.
మునుగోడు ఎన్నికను తీసుకున్నా వామపక్షాల బలంతోనే టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచాడని సర్వే సంస్థలే కాదు, రాజకీయ విశ్లేషకులు సైతం ఢంకా భజాయిస్తున్నారు. ఓ విషయం చెప్పవచ్చు.. ప్రతిష్ఠాత్మకంగా సాగిన ఈ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ పరువు కాపాడాయని కూడా చెప్పుకోవచ్చు. తోకపార్టీలు అని కేసీఆర్ తో దెప్పి పొడిపించుకున్న అవే కమ్యూనిస్టు పార్టీలు నేడు తోకసాయంగా మారి బీజేపీ ఓటమిలో పాలుపంచుకున్నాయి. ఎట్ల లేదన్నా మునుగోడు నియోజకవర్గం సీపీఐ, సీపీఎం పార్టీలకు సుమారు 15 వేల నుంచి 20 వేల ఓట్లున్నాయని ముందునుంచే అంచనాలు వచ్చాయి.
టీఆర్‌ఎస్ పార్టీకి 10 వేలకు పైగా ఓట్ల మెజారిటీ వచ్చింది. దీన్ని బట్టి వామపక్షాల ఓట్లలో సగం ఓట్లు పడ్డా టీఆర్‌ఎస్ ఆధిక్యం వాటి ఓట్లేనని చెప్పుకోవచ్చు. లేకుంటే బీజేపీ చేతిలో చావుదెబ్బ తగిలేది. ఇలా పలు ఎన్నికల్లో వామపక్షాల పొత్తు కీలకంగా మారింది. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ చేజేతులా వామపక్షాలను సమన్వయం చేసుకోలేకపోయిందనేది ఓ వాదన.
కాంగ్రెస్ పార్టీకి ఎనుముల రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆ పార్టీ దూకూడు మీదున్న మాట వాస్తవమే. ఆ పార్టీ కేడర్‌లో కూడా హుషారు పెరిగింది. అంతవరకూ స్తబ్దుగా ఉన్న నియోజకవర్గ నేతలు యాక్టివ్ అయ్యారు. పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేశారు. పలుచోట్ల నిర్వహించిన బహిరంగ సభల ద్వారా అటు కేడర్‌కు, ఇటు ప్రజలకు బలమైన సంకేతాలు పంపారు.
వరంగల్ సభలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ పాల్గొన్న సభలో ఏకంగా వరంగల్ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే చేపట్టే పథకాలను ప్రకటించారు. దీంతో పార్టీలో ఊపొచ్చింది. న్యూట్రల్ ప్రజలు కూడా ఆలోచనల్లో పడ్డారు. ఈ అవకాశంతో చేరికల పర్వానికి తెరలేపారు. ఒకరి తర్వాత ఒకరిని చేర్చుకోసాగారు. ఢిల్లీ కేంద్రంగా కూడా చేరికలను వేగవంతం చేశారు.
కానీ ఇక్కడే ఓ లాజిక్కు మరిచారు.. చాలా సమయముందని భావించారో ఏమో కానీ.. ఇతర ప్రతిపక్ష పార్టీలతో కలిసి పోయే విషయాన్ని మరిచారు. ఒకటి రెండు సందర్భాల్లో కలిసినా అంతటితోనే వదిలేశారు. మళ్లీ ఉమ్మడి ఆలోచనను చేయలేకపోయారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై, ప్రజావసరాలను తీర్చడంలో ప్రభుత్వ వైఫల్యాలపై ఉమ్మడి పోరాటానికి బాటలు వేయడంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ విఫలమైంది.
బీజేపీ మినహా ఇతర ప్రతిపక్ష పార్టీలను కలుపుకొని పోవడంలో నిర్లక్ష్యం ప్రదర్శించింది. అప్పుడే టీఆర్ఎస్ ఓడిపోతుంది.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది.. అన్న మితిమీరిన భావన కాంగ్రెస్ అన్ని స్థాయిల నేతల్లో కలిగింది. దీంతో ఉమ్మడి భావన మరిచారు.
దీనికి తోడు కాంగ్రెస్ నేతల వైఖరి ఇతర పక్షాలకే కాదు స్వపక్షంలోని వారికీ రుచించడం లేదు. ఒక రంకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి ముందరికాళ్లకు ఎందరో బంధాలేసి వెనక్కి లాగే ప్రయత్నాలు చేయడం ఆ పార్టీకి శరాఘాతమే. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఆ పార్టీలో పరిస్థితి దాపురించింది. కాంగ్రెస్ వ్యతిరేకులే కాదు..
స్వపక్షంలోని వారు కూడా కొందరు అసహనంతో అంటున్న మాటేంటో తెలుసా.. కాంగ్రెస్ పార్టీలో డజను మంది ముఖ్యమంత్రి అభ్యర్థలున్నారని అంటుంటారు. ఇదీ ఒకందుకు నష్టమే. మరో ముఖ్య విషయమేమిటంటే అప్పటికే 12 మంది ఎమ్మెల్యేలు చెప్పా పెట్టకుండా కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ గూటిలో చేరిపోయారు. ఇది కూడా ఆ పార్టీని నమ్మఖరాబు చేసింది.
ఇలా కాంగ్రెస్ నేతల్లో ఉన్న అనైక్యత, వేరే పార్టీకి వెళ్తారనే భావన, ఇదే పార్టీ నేతల్లో టీఆర్ఎస్ కు కోవర్టులున్నారనే అపవాదు, అత్యధికంగా రెడ్ల ఆధిపత్యం ఉందనే అభిప్రాయం, ఒకరంటే ఒకరికి పొసగదనే విషయం.. వెరసి వామపక్షాలతో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలకు కాంగ్రెస్ చేరువ కాలేకపోయింది. వాటిని కాంగ్రెస్ పార్టీ కలుపుకోలేక పోయింది. దీంతో కాంగ్రెస్ కంటే టీఆర్ఎస్ తోనే వామపక్షాలు మేలనుకున్నాయి.
డబ్బలు ఆశ, కేసుల మాఫీ ఘోస టీఆర్ఎస్ తీర్చిందా.. లేదా.. అనేది పక్కన పెడితే వామపక్షాలను కాంగ్రెస్ కలుపుకొని పోవడంలో వెనకబడింది అనవచ్చు. అందుకే ఆలస్యం.. అమృతం విషంగా మారి కాంగ్రెస్ కు శత్రుకూటంలోకి వామపక్షాలు చేరిపోవడం ఖాయమైంది. ఇప్పటికైనా ఓ చివరి అవకాశం లేకపోలేదు. ఉమ్మడి పోరాటాలకు వామపక్షాలతో సఖ్యత పెంచుకొని దారికి తెచ్చుకుంటే వచ్చే ఎన్నికల నాటికి పొత్త పొడిచే అవకాశం లేకపోలేదు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యం కావచ్చు. వేచి చూద్దాం.