సారు యాదిమర్శిండా.. మనల్నే మరిపిస్తుండా?

రచ్చబండ, ప్రత్యేక ప్రతినిధి : మన సీఎం కేసీఆర్‌ సారు రాజకీయంల చాణుక్యుని లెక్కే అంటుంటరు.. ఆయన ఏది జేసినా అబ్బురంగనే ఉంటది. ఎన్నో మస్తు జేసి, ఎంతో మందిని గమ్ముగుండేట్లు జేసె మరి. తెలంగాణ పోరాటమప్పుడైతె ఆయన మాటలు కోటలే దాటి తూటాలై పేల్నయ్‌.. అగ్గినే రాజేయబట్టె.. గిప్పుడు గూడా రొండుమాళ్లు గెలవబట్టె. మరి అవతలోళ్లు గిలగిలా కొట్టుకోబట్టిరి. కానీ సారు యాదిమర్సినట్లుంది. లేదా మనల్నే యాదిమరవబెట్టిండో ఏమో గానీ.. గిదేందో చూద్దాం రార్రి..

2014ల, 2018ల కారు పార్టీని గెలిపించి సారు మురిసిపోబట్టె. జనంగూడ సారు, కారుతోనే మేల్జర్గుద్దని నమ్మబట్టె. మజ్జమజ్జన వచ్చిన ఎలచ్ఛన్లల్ల కారు పార్టీ బంపర్‌గా గెలవబట్టె. అయితే దుబ్బాక, హుజూరాబాద్‌ ఎన్నికల్ల మాత్రం సార్‌కి సికాకు బట్టె. మళ్ల గీ మునుగోడప్పుడు కూడా అట్నే ఉండె.. హమ్మ సారు ఊకుంటడా.. ఊకోలే.. మంత్రుల్ని, ఎమ్మెల్యేల్ని, అందర్నీ తోలిండు. అక్కడ్నే ఉండి అంతుజూడమనిజెప్పె.. జూసిరమ్మంటె మనోళ్లు కాల్చే వచ్చిర్రు. కారుపార్టీనే గెలిపించిర్రు.

అయితే అసలు ఇషయంలోకి వద్దాం. గా మధ్యన ఎమ్మెల్యేల్ని బేరాలాడినట్లు బయటబడె. పోలీసోల్లు దాడిజేసి పట్టుకోబట్టిరి. గిందుల తప్పెవలది.. ఒప్పెవలదో గానీ.. దాన్ని జర పక్కన బెడదాం.. అయ్యాలప్పుడే గా నలుగురు మాయమైండ్రు.. ప్రగతిభవన్ల తేలిండ్రు.. ఇగ గప్పట్నించి అక్కడే ఉండబట్టె.. ఆళ్లని మెసల్నియ్యకుండా జేసిండని అందరూ అనుకుంటుండ్రు. మున్గోడు ఎలచ్చన్లకు ముందు మీటింగుకు కేసీఆర్‌ సారు వచ్చిండు.

ఆ నల్గురు ఎమ్మెల్యేలు ఎటన్నబోతరనుకుండో ఏమోనని గాలిమోటర్ల ఎంటనే బెట్టకొచ్చిండు. ఎటూ బోకుండ పైన్నే కూసోబెట్టిండు. మీటింగు ముచ్చట సగంజెప్తె.. గా నల్గురు ఎమ్మెల్యేల గురించి సగం జెప్పబట్టె.. ఆహో.. ఓహో.. అనబట్టె.. తెలంగాణ తెగువ జూపిండ్రని భగ్గ పొగిడిండు.. జనం జేజేలు పలికిండ్రు.. అంతా అయిపోయినంక గాలిమోటర్లనే ఆ నల్గురిని తోల్కబోయిండు.

మళ్ల ఆళ్లు ఎక్కడా కంటికి కన్పడకబోయిరి. ఇంటికి పోదామన్నా పోనీయలేదని, ఆళ్ల ఇంట్లోళ్లను ఈడికే రార్రి అని పిలిసిండ్రంట. సూసుకోని సప్పుడు జెయ్యకుండా పోయిర్రంట. ఈళ్లని మాత్రం ఎటూ బోనియ్యలేదంట. మళ్ల ఇంకోటి జరిగె.. ఏందంటే ఎమ్మెల్యేల బేరం గురించి చెప్పెటందుకు కేసీఆర్‌ సారు మీటింగుబెట్టె. హమ్మా.. ఆళ్లను ముందగాల్నే పంపి కూసోబెట్టిండు.

పక్కనే కూసోవాలని హుకుం బెట్టిండు.. అయితే సారొచ్చే ముందల ఆ ఎమ్మెల్యేలకి, సీఎం సారుకు మజ్జన ఓ మంత్రిగారు కూసోబోతే సీఎం సారు ఊకుంటడా.. గద్దాయించి దూరం జరపబట్టె.. మళ్లా ఈ సారి పువ్వు పార్టోళ్ల మీద సారు కోపం జేయబట్టె. గిదేంది వయా మోడీ, షా అంటూ అడగబట్టె.. పోట్వొల, ఈడీయోలను జడ్జిలకి, పత్రికలోల్లకు పంపినని జెప్పె. అంతా అయిపోంగనే మళ్లా ఆళ్లని యంటనే బెట్కబాయె. ఇంతకూ ఆళ్లు బయటకే ఎల్లకపాయె. మళ్ల ఆళ్లకి బుల్లెట్‌ ప్రూఫ్‌ కారు ఇచ్చి పోలీసోల్లని పెంచుడాయె..

అయితే సారు ఇంతగనం జెప్పుడాయె. చేసుడాయె. రొండు మీటింగులల్ల పువ్వుగుర్తొళ్ల బేరాల గురించే చెప్పుడాయె. ఆళ్ల ఇజ్జత్‌ తీయబట్టె. షరమున్నాది.. అని సారు ఎచ్చరిక జేసె.. మా వోళ్లను ఎట్ట గొంతరని అడగబట్టె.. ఇంత బాగానే ఉంది.. కానీ సారూ ఆళ్లల్ల ముగ్గురు మనోళ్లు కాదాయగా అని గులాబీ తమ్ముళ్లు గుసగుసలాడుకోబట్టిరి. చెయిగుర్తు కాడ గెలిచిర్రు గానే. మనం తోల్కొస్తిమి. గప్పుడేమన్న మనం ఇయ్యబడ్తిమా.. అని చెవులు కొరుక్కోబట్టిరి. మనతానికి వచ్చిర్రంటే ఏదో ఆశపడే వస్తిరాయె.. ఈళ్లే గాకుండా ఇంకా పది మందికి పైగా బుట్టలేస్తిమి..

గప్పుడు గా చెయి గుర్తోళ్లు గిట్ల మొత్తుకోక పోయిరి అని ఆళ్లు, ఈళ్లే అని కాదు అందరూ అనుకోబట్టిరి. మావోళ్లను డజను మందిని కొన్నరని చెయి గుర్తోళ్లు ఊకె సారుపైన అబాండమేస్తున్రి. నిప్పులేందే పొగరాజదు.. గదా అని మస్తు సమ్జాయించబట్టిరి. సరె ఏదేమైనా ఆళ్లు మనోళ్లు గాకున్నా మనతానకొచ్చిరి.. మనమేమె మన నెత్తురు.. మన సత్తురు.. అని అనబడితే జనం నవ్వుకోరా.. అని సగటు మనిషి ఆలోచన జెయబట్టె..