• జైలు జీవితం అనుభవించినా మారని వైనం
• హన్మకొండలో నిందితుడి అరెస్టు
• వివరాలు వెల్లడించిన వరంగల్ సీపీ డాక్టర్ తరుణ్ జోషి
వరంగల్ : పగటి పూట ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తునే రాత్రి సమయాల్లో చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని సీసీఎస్, హన్మకొండ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. నిందితుడి నుంచి సుమారు రూ.7.80లక్షల విలువల 169 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక సెల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడి అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి వివరాలను వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకులం జిల్లా కరజాడ గ్రామానికి చెందిన బలగ హరిబాబు ప్రస్తుతం హన్మకొండ నగరంలోని కాపువాడలో నివాసం ఉంటున్నాడు. ఇంజనీరింగ్ లో పట్టా పుచ్చుకున్న హరిబాబు మొదట స్వగ్రామంలోనే ఉపాధి హామీ పథకంలో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేశాడు.
ఆ సమయంలో హరిబాబు చేడు వ్యసనాలు, జల్సాలకు అలవాటు పడ్డాడు. ఉద్యోగం ద్వారా వచ్చే అదాయం తన జల్సాలకు సరిపోకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించేందుకు గాను నిందితుడు దొంగతనమే మార్గంగా ఎంచుకున్నాడు.
శ్రీకాకుళం పట్టణం, సమీప గ్రామీణ ప్రాంతాల్లో తాళం వేసి ఉన్న ఇండ్లను లక్ష్యంగా చేసుకోని 12కు పైగా చోరీలకు పాల్పడ్డాడు. ఈ మేరకు నిందితుడిని స్థానిక పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. నిందితుడు జైలు నుంచి విడుదలైన అనంతరం ప్రముఖ ఫైబర్ నెట్ వర్క్ కంపెనీలో ఉద్యోగిగా చేరి నియమించబడి హన్మకొండ ప్రాంతంలో పని చేసేందుకుగాను గతేడాది హన్మకొండకు చేరుకున్నాడు.
తాను పనిచేసే కంపెనీకి చెందిన గెస్ట్ హౌజ్ లో నివాసం ఉంటున్నాడు. ఇక్కడ కూడా నిందితుడు తిరిగి యథాప్రకారం జల్సాలు చేయనారంభించాడు. దీనికోసం నిందితుడు మరో చోరీలకు తెగబడ్డాడు.
నిందితుడు పగలు ఉద్యోగం చేస్తూనే రాత్రి సమయాల్లో చోరీలకు పాల్పడుతుండేవాడు. ఈ విధంగా నిందితుడు మొత్తంగా నాలుగు దొంగతనాలకు పాల్పడ్డాడు. ఇందులో హన్మకొండలో రెండు, కేయూసీ, హసన్ పర్తి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒకటి చొప్పున చోరీలకు పాల్పడ్డాడు.
ఈ చోరీలపై దృష్టి సారించిన పోలీసులు సెంట్రల్ జోన్ డీసీపీ అశోక్ కుమార్, అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్ సూచనల మేరకు క్రైమ్స్ హన్మకొండ ఏసీపీలు డేవిడ్ రాజు, కిరణ్ కుమార్ అధ్వర్యంలో సీసీఎస్, హన్మకొండ పోలీసులు చేపట్టిన దర్యాప్తులో నిందితుడిని గుర్తించి అతని కదలికలపై నిఘా ఉంచారు.
నిందితుడు హరిబాబు చోరీ సొత్తును అమ్మేందుకు గాను హన్మకొండలోని టైలర్ స్ట్రీట్లోకి వచ్చినట్లుగా పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు పోలీసులు వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకోని తనిఖీ చేశారు. అతని వద్ద బంగారు ఆభరణాలను గుర్తించి, విచారించారు. నిందితుడు చోరీలకు పాల్పడినట్లు అంగీకరించాడు.
నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్ జోన్ డీసీసీ అశోక్ కుమార్, అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్ సూచనల మేరకు క్రైమ్స్ హన్మకొండ ఏసీపీలు డేవిడ్ రాజు, కిరణ్ కుమార్‌తో పాటు
సీసీఎస్, హన్మకొండ ఇన్ స్పెక్టర్లు రమేష్ కుమార్, వేణుమాధవ్, ఎస్ఐలు రాజ్ కుమార్, సంపత్ కుమార్, సీసీఎస్ ఏఎస్ఏలు శివకుమార్, హెడ్ కానిస్టేబుల్ జంపయ్య, కానిస్టేబుళ్లు చంద్రశేఖర్, నజీరుద్దీన్, హన్మకొండ కానిస్టేబుళ్లు ప్రశాంత్, భౌసింగ్, శివకృష్ణ, ఎండీ గౌస్ పాషా, వీరేందర్, వినోద్, భాస్కర్, శ్రీకాంత్ ను పోలీస్ కమిషనర్ అభినందించారు.