ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు

నల్లగొండ ఎంపీ, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొన్నాళ్లుగా కాంగ్రెస్ రచ్చబండ కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఆయన విస్తృతంగా పర్యటిస్తున్నారు.

గరిడేపల్లి మండలం వెలిదండ, కోనాయిగూడెం, కుతుబ్ షాపురం, గడ్డిపల్లి గ్రామాల్లో సోమవారం నిర్వహించిన రైతు భరోసా యాత్ర, రచ్చబండ కార్యక్రమాల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన కీలక సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రభుత్వ రద్దుపై జోస్యం
2023 ఫిబ్రవరి నెలలో టీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు కాబోతుందని జోస్యం చెప్పారు. మే నెలలో కర్ణాటకలో జరగబోయే ఎన్నికలతో పాటు తెలంగాణలో కూడా ఎన్నికలు వస్తాయని ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతున్నాయి.

ఉత్తమ్ శపథం
మరో సంచలన వ్యాఖ్యలు చేసిన ఉత్తమ్ హుజూర్ నగర్ నియోజకవర్గంలో తీవ్ర చర్చకు తెరలేపారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన చెప్పారు. రాబోయే ఎన్నికల్లో 50 వేల మెజారిటీకి ఒక్క ఓటు తగ్గినా తాను రాజకీయాల్లో ఉండబోనని ఉత్తమ్ కుమార్ రెడ్డి శపథం చేశారు.

అధికార పార్టీ నేతల భూకబ్జాలు, అరాచకాల గురించి సూర్యాపేట జిల్లా కలెక్టర్, ఎస్పీ దృష్టికి తీసుకెళ్లినా వారు ఎలాంటి చర్యలు తీసుకోలేక పోతున్నారని విమర్శించారు.

మెరుగైన వ్యవస్థను తెస్తాం
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణి వ్యవస్థను రద్దు చేస్తామని మరోసారి పునరుద్ఘాటించారు. ధరణి వల్ల ధనవంతులకు తప్ప పేదలకు న్యాయం జరగలేదని, దాని స్థానంలో మరో మెరుగైన వ్యవస్థను తెస్తామని వెల్లడించారు.

అధికారం ఎవరికీ శాశ్వతం కాదు..
రెవెన్యూ, పోలీస్ అధికారులు ప్రభుత్వంతో కలిసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదనే విషయాన్ని అధికారులు గ్రహించాలని ఉత్తమ్ హితవు పలికారు.