శోకసంద్రంలో నటి మీనా కుటుంబం

ప్రముఖ సినీ నటి మీనా కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఆమె భర్త విద్యాసాగర్ తీవ్ర అనారోగ్యంతో బుధవారం కన్నుమూశారు. దీంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. మీనాకు తీరని శోకం మిగిలింది.

విద్యాసాగర్ కు కొవిడ్ సోకి చికిత్స పొందుతుండగానే తీవ్ర అనారోగ్యానికి గురై కన్నుమూశారు. ఆయన ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయి. చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా వైద్యులు వాటిని మార్చేందుకు యత్నించారు. సరైన సమయంలో ఆర్గాన్ డోనర్ దొరకలేదు. దీంతో ఆయన తుదిశ్వాస విడిచారు.

అయితే ఆయన మరణానికి పావురాలే కారణమని తెలుస్తోంది. వారింటికి సమీపంలో అధిక సంఖ్యలో పావురాలు ఉంటాయి. వాటి వ్యర్థాల నుంచి వచ్చే గాలిని పీల్చడంతో వారి కుటుంబంలోని అందరి ఊపిరి తిత్తులు దెబ్బతిన్నాయి.

అయితే విద్యాసాగర్ కు పోస్ట్ కొవిడ్ సోకడంతో ఊపిరి తిత్తులు మరింతగా దెబ్బతిన్నాయి. దీంతో వైద్యులు చికిత్స జరుపుతుండగానే ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

నటి మీనా 2009లో బెంగళూరుకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ విద్యాసాగర్ ను వివాహమాడింది. వారిద్దరికీ ఓ కూతురు కలిగింది. వివాహం అనంతరం దృశ్యం-2, పెద్దన్న చిత్రాల్లో నటించినా మీనా కుటుంబానికి పరిమితమైంది.

అన్యోన్యంగా సాగుతున్న మీనా కుటుంబంలో విద్యాసాగర్ మరణం కోలుకోని విధంగా దెబ్బతీసింది. దీంతో తెలుగు, తమిళ, కన్నడ సినీ రంగాల్లో విషాదం అలుముకుంది. మీనా అభిమానుల్లో ఆవేదన నిండుకుంది.