మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వ ఉనికికి ప్రమాదం ఏర్పడిన ఈ తరుణంలో మరో కీలక మలుపు తిరగనుంది. ఇప్పటికే ఏక్ నాథ్ షిండే నేతృత్వంలో 39 మంది ఎమ్మెల్యేలు చీలిపోయారు. గురువారం జరిగే బలపరీక్షలో ప్రభుత్వం పడిపోయి మరో ప్రభుత్వం ఏర్పడటమా, లేదా అదే ప్రభుత్వం నిలదొక్కుకోవడమా అనేది తేలనుంది.
ఇప్పటికే ప్రభుత్వం మైనారిటీలో పడింది. మేజిక్ ఫిగర్ 144 మంది ఎమ్మెల్యేల సంఖ్యకు తక్కువకే అఘాడీ కూటమి పడిపోయింది. షిండే నాయకత్వంలోని శివసేన చీలిక వర్గం, బీజేపీ, స్వతంత్రుల మద్దతును బలపరీక్షలో ప్రదర్శించేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి.
శివసేన నుంచి నాలుగింట మూడొంతుల మంది ఎమ్మెల్యేలు చీలికవర్గంలో చేరడంతో ఆ పార్టీకి తీరని నష్టం జరిగింది. ఆ పార్టీకి 55 మంది ఎమ్మెల్యేలకు గాను 39 మంది షిండే వర్గంలో చేరిపోయారు. దీంతో ప్రభుత్వ పతనానికి దారితీసే అవకశముందని విశ్లేషకులు సైతం అంచం వేస్తున్నారు.
ఈ దశలో మరో కీలక మలుపు తిరిగే అవకశాముంది. శివసేన పార్టీకి చెందిన 19 మంది ఎంపీలలో 14 మంది షిండే వర్గంలో చేరనున్నట్లు సమాచారం. ఇప్పటికే షిండే, బీజేపీ నేతలతో వారంతా సమావేశమై చర్చించినట్లు సమాచారం.
ఇదే జరిగితే శివసేన పార్టీ షిండే వర్గం చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ పార్టీ, ఎన్నికల గుర్తు కోసం షిండే వర్గం చేసే ప్రయత్నాలకు ఎంపీల మద్దతుంటే సునాయాసం అవుతుందని అంచనా. తమనే అసలైన శివసేనగా గుర్తించాలని షిండే ఇప్పటికే కోరుతూ వస్తున్నారు.