16కు చేరిన అమర్ నాథ్ మృతుల సంఖ్య.. సురక్షిత ప్రాంతాలకు 15 వేల మంది యాత్రీకులు

రచ్చబండ : జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలోని అమర్ నాథ్ గుహకు సమీపంలో నిన్న వరద బీభత్సానికి మృతి చెందిన యాత్రికుల సంఖ్య శనివారం నాటికి 16కు చేరుకుంది. ఆర్మీ రక్షణ చర్యల్లో మునిగి తేలింది. ఇప్పటి వరకూ 15వేల మందికి పైగా యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.

శుక్రవారం సాయంత్రం 5 గంటల తర్వాత వరదలు సంభవించాయి. కొండచరియలు విరిగిపడటంతో రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి. వరదల్లో మరో 40 మంది గల్లంతైనట్లు సమాచారం. అమర్ నాథ్ గుహ వద్ద ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఐటీబీటీ, సీఆర్పీఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి.

హెలికాప్టర్ ద్వారా క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలిస్తున్నారు. శనివారం నుంచి అమర్ నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.

సురక్షితంగా బయటపడ్డ ఎమ్మెల్యే రాజాసింగ్
ప్రమాద స్థలానికి కిలోమీటరు దూరంలోనే చిక్కుకున్న గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సురక్షిత ప్రాంతానికి తరలించారు. తాము చూస్తుండగానే అక్కడక్కడా ఉన్న టెంట్లన్నీ వరదలో కొట్టుకుపోయాయని రాజాసింగ్ తెలిపారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతోనే తాను బయటపడ్డానని తెలిపారు.

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ వరద బీభత్సం పట్ల విచారం వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు.