సీపీఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి

సీపీఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి
* తెలంగాణ రాష్ట్ర సీపీఎస్ ఉద్యోగుల సంఘం నేతల వినతి
* మంత్రులు కోమటిరెడ్డి, శ్రీధర్ బాబుతో పాటు కోదండరాంను కలిసిన నేతలు

రచ్చబండ, శంకర్ పల్లి: సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి 1980 పెన్షన్ రూల్స్ ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర సీపీఎస్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో హైదరాబాదులో శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2004 తరువాత నియామకం ఐన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని ప్రవేశ పెట్టడం వల్ల సుమారు 30 సంవత్సరాలపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుస్తూ ప్రజా పాలనలో క్రియాశీలక పాత్ర పోషించిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం వృద్దాప్యంలో పెన్షన్ సౌకర్యం లేక ఆర్థిక, ఆనారోగ్య సమస్యలతో మానసిక ఆందోళనకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరణించిన, పదవీ విరమణ పొందిన సీపీఎస్ ఉద్యోగుల కుటుంబాల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉదని వెంటనే సీపీఎస్ విధానం రద్దుచేసి ఆయా కుటుంబాలకు పెన్షన్ సౌకర్యం కల్పించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇటీవల దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అన్ని రాష్ట్రాల్లో సి.పి.ఎ‌స్ విధానాన్ని రద్దు చేసిన విషయం మీకు విదితమే. మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో నందు సి.పి.ఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని హామి ఇచ్చారని గుర్తు చేశారు. 2004 సెప్టెంబర్ 1 తరువాత నియామకం ఐన దాదాపు 2 లక్షల పైచిలుకు సి.పి.ఎస్ ఉద్యోగ కుటుంబాల ఆకాంక్ష మేరకు ఈ సమస్యను ఉద్యోగులు ఎదుర్కొంటున్న అత్యంత ఆవశ్యమైన సమస్యగా గుర్తించి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి అతి త్వరలోనే రాబోయే ఎంపీ ఎలక్షన్స్ లోపే పాత పెన్షన్ పునరుద్ధరణకు కృషి చేయాలని కోరారు .మీ ప్రజాపాలనలో పాత పెన్షన్ పునరుద్ధరణ ప్రకటన కోసం 2 లక్షల కుటుంబాలు ఎదురు చూస్తున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నాగవెల్లి ఉపెందర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు లింగమల్ల దర్శన్ గౌడ్, సురేందర్ సింగ్ ఠాగూర్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు దొంతి రెడ్డి పంకజ్ రెడ్డి, భక్తవత్సల రవికిరణ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ తాహేర్ అలి, నల్గొండ జిల్లా కోశాధికారి అందుగుల విజయ్, మహిళా కన్వీనర్ వల్లపుదాసు భూలక్ష్మి, జయశ్రీ, సక్కుబాయి, విజయ్, రవికిరణ్, స్వర్ణలత, ఆంథోని, పద్మజ, చైతన్య, పుష్ప, సీతారాం వివిధ శాఖల ఉద్యోగులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు