ఆ నలుగురిపై బీజేపీ నజర్

దక్షిణాదిపై బీజేపీ కన్ను

తెలంగాణ రాష్ట్రంలో అధికారమే పరమావధిగా ముందుకు సాగుతున్న బీజేపీ దక్షిణాది జిల్లాలపై దృష్టి సారించింది. ఇప్పటికే ఉత్తరాదిలో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఎంపీ స్థానాల్లో పాగా వేసింది. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో విజయం సాధించి, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆశాజనకమైన స్థానాలను బీజేపీ కైవసం చేసుకొంది. దీంతో ఉత్తరాది జిల్లాలు, హైదరాబాద్ నగరంలో ఆ పార్టీ తన బలం పెంచుకొంది. ఇదే సమయంలో తాజాగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేరికతో బీజేపీకి ఉత్తర జిల్లాల్లో

మరింత బలం వచ్చినట్లయింది. అయితే దక్షిణాది జిల్లాలైన ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి, మెదక్ తో పాటు వరంగల్ ఉమ్మడి జిల్లాల్లో బలం పెంచుకునేందుకు వ్యూహం పన్నుతోంది. ఈ మేరకు ఆయా జిల్లాల్లోని పట్టున్న నేతలను తమ వైపు తిప్పుకునేందుకు ఆ పార్టీ నేతలు పాచికలు పన్నుతున్నారు. ఇప్పటికే నల్లగొండ జిల్లాలో బలమైన నేతగా గుర్తింపు ఉన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రంగారెడ్డి జిల్లలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి, వరంగల్ జిల్లాలో కడియం శ్రీహరిని

బీజేపీలో చేర్చుకునేందుకు ఆ పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే వారితో మంతనాలు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. వారు కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు టీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి నేతలు, టికెట్ రాదని నిర్ధారించుకునే నేతలను తమ వైపు తప్పుకునేందుకు బీజేపీ ముఖ్యులు జాబితానే తయారు చేస్తున్నట్లు తెలిసింది. వారి చేరికతో పార్టీ బలాన్ని మరింత పెంచుకొని 2023 ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ ను ఎదుర్కొని, ఆ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.