తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త

ఉద్యోగాల నియామకం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త రానే వచ్చింది. పెద్ద మొత్తంలో ఖాళీల నియామకానికి వచ్చే నెలలోనే నోటిఫికేషన్ జారీ చేసే అవకాశముంది. ఈ మేరకు నియామక ప్రక్రియ కూడా ఊపందుకుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 2014, 2018 సంవత్సరాల్లో పోలీసు శాఖలో భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టింది. 2018లో రికార్డు స్థాయిలో 18 వేల ఉద్యోగాలను విజయవంతంగా నియామకం చేసింది.

ప్రస్తుతం మరో విడత పోలీసు నియామకాలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో పోలీసు శాఖ తరఫున ప్రతిపాదనలు సైతం పంపారు. ఈ మేరకు మొత్తంగా వివిధ స్థాయిల్లో 19,449 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిసింది.

వాటిలో ఎస్ఐ స్థాయిలో 360 సివిల్, 29 ఏఆర్, 20 కమ్యునికేషన్స్, కానిస్టేబుల్ స్థాయిలో 7,700 సివిల్, 6,680 ఏఆర్, తెలంగాణ ప్రత్యేక పోలీసు పటాలం (టీఎస్ఎస్పీ)లో 3,850, 15వ బెటాలియన్ లో 560, కమ్యునికేషన్స్ విభాగంలో 250 కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అయితే గతేడాది డిసెంబర్ నెలలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆయా ఉద్యోగాలకు నియామక ప్రక్రియకు ఆమోదం తెలిపింది.

అయితే రాష్ట్రంలో నూతన జిల్లాలకు రాష్ట్రపతి ఆమోదం తెలపలేదు. కానిస్టేబుల్ పోస్టులు జిల్లా స్థాయివి కావడంతో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన నియామకాలు చేపట్టాలని భావించారు. దీనివల్ల కొందరికి అన్యాయం జరుగుతుందని అభ్యర్థులు, ప్రజాప్రతినిధులు అభ్యంతరాలు తెలపడంతో అధికారులు వెనక్కి తగ్గారు. ఈలోగా కరోనా విజ్రుంభణతో ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. ప్రస్తుత్తం కొంత తగ్గుముఖం పట్టడంతో వచ్చే నెలలో ప్రక్రియ మొదలు పెట్టనున్నారు. ఈ మేరకు వారంలోగా ఉన్నతాధికారులు సమావేశమై నిర్ణయించే అవకాశముందని విశ్వసనీయంగా తెలిసింది.