చిక్కిన సూదిగాళ్లు? వివాహేతర బంధమే బలి తీసుకుంది?

• సూదితో వ్యక్తి హత్య కేసులో వెలుగులోకొస్తున్న చేదు నిజాలు?
• ముగ్గురు నిందితుల గుర్తింపు
• పోలీసుల అదుపులో ఇద్దరు.. మరొక వ్యక్తి పరారీ

ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభిలో బైక్ పై లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తిని ఇంజక్షన్ తో హత్య చేసిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలం బొప్పారం గ్రామానికి చెందిన షేక్ జమాల్ సాహెబ్ (55) ఈ ఘటనలో మృతి చెందారు. పోలీసులు వేగవంతంగా చేపట్టిన దర్యాప్తులో విస్తుగొలిపే నిజాలు బయటకొస్తున్నట్లు తెలుస్తోంది.

రచ్చబండ, ముదిగొండ : ఖమ్మం జిల్లా చింతకాని మండలం బొప్పారం గ్రామానికి చెందిన షేక్ జమాల్ సాహెబ్ (55) తన కూతురును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గండ్రాయి గ్రామానికి ఇచ్చాడు. తన కూతురు ఇంటికి వెళ్లేందుకు ఆయన తన బైక్ పై వల్లభి మీదగా గండ్రాయి వెళ్తున్నాడు. మార్గమధ్యలోని బాణాపురం- వల్లభి మధ్యలో గుర్తు తెలియని వ్యక్తి లిఫ్ట్ ఇవ్వమని అడిగాడు. బైక్ ఆపి ఆ వ్యక్తిని ఎక్కించుకున్నాడు.

అప్పటికే మాస్క్ ధరించి గుర్తు పట్టని విధంగా క్యాప్ పెట్టుకున్న ఆ గుర్తు తెలియని నిందితుడు బాణాపురం దాటిన తరువాత వల్లభి వద్ద పొలాల సమీపంలో బైక్ పై ఉండగానే జమాల్ సాహెబ్ కు వెనుక నుంచి ఇంజక్షన్ ఇచ్చి మోటర్ సైకిల్ దిగి పరారైనట్లుగా స్థానికులు తెలిపారు. దీంతో జమాల్ సాహెబ్ అక్కడికక్కడే చనిపోయాడు.

వేగవంతంగా పోలీసుల దర్యాప్తు
జమాల్ సాహెబ్ మరణవార్త తెలుసుకున్న ఖమ్మం రూరల్ ఏసీపీ బస్వారెడ్డి, సీఐ శ్రీనివాస్ రావు, ఎస్ఐ నాగరాజు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. హత్య ఎలా జరిగింది..? ఎందుకు జరిగిందనే విషయాలపై ప్రజలు, పోలీసులు ఆరా తీయసాగారు.

అయితే ఆయన సంబంధీకులు హత్య చేశారా..? ప్రొఫెషనల్ కిల్లర్స్ హత్య చేశారా? సైకో హతమర్చాడా? అనే విషయాలపై ఆరా తీశారు. కొన్ని వివరాల సేకరణ కోసం నాలుగు బృందాలను రంగంలోకి దింపారు. ఇక అంతే సంగతి..? వల్లభిలో జరిగిన హత్య కేసులో పురోగతి లభించింది. నాలుగు బృందాలుగా పోలీసులు దర్యాప్తు చేపట్టగా, నిందితులను గుర్తించినట్లు తెలుస్తోంది.

తెలిసిన వారి పనే?
చింతకాని మండలం నామారం గ్రామానికి చెందిన ఒక ఆటో డ్రైవర్, మరొక వ్యక్తి ట్రాక్టర్ డ్రైవర్ ఈ హత్యకు కుట్ర పన్నినట్లుగా తెలుస్తోంది. అందుకు ఖమ్మంలో ఆర్ఎంపీగా పనిచేస్తున్న మరొకతను పాయిజన్ ఇంజక్షన్ తీసుకొచ్చి ఇవ్వగా ఆటో, ట్రాక్టర్ డ్రైవర్లిద్దరూ హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ మేరకు ముగ్గురినీ నిందితులుగా తెల్చినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే అందులో ఇద్దరు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆర్ఎంపీ మాత్రం పరారీలో ఉన్నట్లు సమాచారం. అయితే ఇప్పటి వరకు పోలీసులు అధికారికంగా ధ్రువీకరించలేదు.

అడ్డొస్తుండనే హతమార్చారా?
ఇదిలా ఉండగా జమాల్ సాహెబ్ హత్యకు ప్రధానంగా వివాహేతర సంబంధమేనని పోలీసులు అనుమానిస్తున్నట్లు సమాచారం. ఆ దిశగా విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను పట్టుకోవడానికి మార్గం సులువైనట్లు తెలుస్తోంది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే ఆలోచనతో అతడిని హత్య చేసినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు పూర్తి వివరాలను తెలపాల్సి ఉంది. బుధవారం కేసు వివరాలను వెల్లడించే అవకాశముందని తెలుస్తోంది.