నాన్నిచ్చిన రూ.300తో బెంగళూరొచ్చా

సౌత్(దక్షిణాది)వుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా పాన్ ఇండియా స్టార్ గా అవతరించిన యష్ మొదట్లో ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసా. కేవలం రూ.300తో బెంగళూరు వచ్చిన ఆయన నేడు వందలాది కోట్లు సంపాదించే సినీ స్టార్ గా ఎదిగాడు. కేజీఎఫ్-2 సినిమాతో ఆయన స్టామీనా జగమంతటికీ నిరూపితమైంది.

ప్రస్తుతం కేజీఎఫ్-2 సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. గత రికార్డులను చెరిపేస్తోంది. బ్లాక్ బస్టర్ హిట్ సాధించి ప్రేక్షకుల మదిలో యష్ ను నిలిపింది. అంతటి స్టార్ తొలి దశలో ఎన్నో కష్టాలు అనుభవించాడు.

తన కెరీర్ మొదట్లో పడిన కష్టాలను ఇటీవల యష్ పంచుకున్నారు. కర్ణాటకలోని హసన్ జిల్లాలో పుట్టిన యష్ ఒక సామాన్య, మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు.

యష్ తండ్రి బస్సు డ్రైవర్. తల్లి గృహిణి. యష్ కు సినిమాలంటే అభిమానం. సినిమాల్లో నటించాలనే కోరిక ఉండేది. కానీ వారింట్లో మాత్రం ఇష్టం ఉండేది కాదు. ఏదైనా ఉద్యోగం చేయాలని చెప్పేవారు.

అయితే యష్ కోరిక తీరేందుకు వారి కుటుంబ సభ్యులు ఓ కండీషన్ పెట్టారు. కొత గడువు ఇచ్చారు. ఆ గడువు లోగా సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవాలి. లేదంటే తాము సూచించిన ఉద్యోగం చేయాలి. దీనికి సరేనని ఒప్పుకున్నాడు.

ఆ కండీషన్ తో బెంగళూరుకు సిద్ధమయ్యాడు యష్. ఈ సమయంలో ఆయన తండ్రి రూ.300 ఇచ్చాడు. వాటితోనే బెంగళూరు చేరుకున్నాడు. ఎన్నో కష్టాలు అనుభవించిన కొన్నాళ్లకు యష్ కు సీరియళ్లలో అవకాశం దక్కింది.

సీరియళ్లలో నటించేప్పుడే యష్ కు పెరొచ్చింది. ఆ తర్వాత మెల్లిగా సినిమాల్లో అవకాశం దక్కించుకున్నాడు. మొదట్లో సపోర్టింగ్ క్యారెక్టర్లు చేసేవాడు. 2008లో రాకీ చిత్రంతో హీరోగా మారాడు. ఆ తర్వాత వచ్చిన వరుస హిట్లతో యష్ కన్నడనాట స్టార్ హీరోగా ఎదిగాడు.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ తో యష్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. తాజాగా వచ్చి ప్రేక్షకులను ఊర్రూతలూగిస్తున్న కేజీఎఫ్-2తో ఆయన స్టార్ డమ్ అందనంత ఎత్తుకు ఎదిగింది.