ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఫలించేనా?

హైదరాబాద్ : దేశంలో ప్రఖ్యాత ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఫలిస్తాయా.. కేంద్రంలోని ప్రస్తుత ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో పడగొట్టాలన్న ప్లాన్ సక్సెస్ అవుతుందా.. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలతో ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలు నిలుస్తాయా.. అన్న చర్చలు జోరుగా సాగుతున్నాయి.

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత తాను చేస్తున్న పనిని వదిలేస్తానని, కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకుంటానని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చెప్పారు. అఅయిత తాజాగా రాహుల్ గాంధీని కలవడం దేశ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ప్రశాంత్ కిషోర్ రాహుల్ గాంధీ తో కలిసిన సమావేశంలోనే ఆయన సోదరి, కాంగ్రెస్ నాయకులు ప్రియాంక గాంధీ వాద్రా,  కేసీ వేణుగోపాల్ కూడా హాజరైనట్లుగా తెలుస్తుంది. ఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాసంలో రాహుల్,  ప్రియాంకా గాంధీలతో ఆయన భేటీ అయ్యారు.

వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ నేతలతో పీకే చర్చించనున్నట్లు సమాచారం. ఇప్పటికే బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అతిపెద్ద రాజకీయ ఫ్రంట్ ఏర్పాటు కోసం వివిధ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో,  రాహుల్ గాంధీని పీకే కలవడం ఆసక్తికరంగా మారింది.

బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయ ఫ్రంట్ ఏర్పాటుకు దారితీస్తుందా.. అన్న చర్చ సాగుతోంది. కాంగ్రెస్ పార్టీతో కలిసి అతి పెద్ద రాజకీయ ఫ్రంట్ ఏర్పాటు చేస్తారా లేదా? కాంగ్రెస్ పార్టీ లేకుండానే ఇతర పార్టీలతో కలిసి రాజకీయ ఫ్రంట్ ఏర్పాటవుతుందా.. అన్న చర్చ కొనసాగుతోంది.

అయితే ఇదే సమయంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కాంగ్రెస్ పార్టీ లేకుండా బీజేపీయేతర అతిపెద్ద రాజకీయ ఫ్రంట్ ఏర్పాటు సాధ్యం కాదని తేల్చి చెప్పారు. అంతేకాదు 2024 లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీల జాతీయ ఫ్రంట్ గురించి శరద్ పవార్..  ప్రశాంత్ కిషోర్ జూన్ 21 న సమావేశమయ్యారు.

ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ నివాసంలో కిషోర్ తో   జరిగిన సమావేశం సుమారు ఒకటిన్నర గంటలు కొనసాగింది. దీనికి ముందు శరద్ పవార్, ప్రశాంత్ కిషోర్ జూన్ 11న ముంబైలో దాదాపు మూడు గంటలు సమావేశమయ్యారు. ఇప్పుడు తాజాగా రాజకీయ ఫ్రంట్ ఏర్పాటు ప్రక్రియలో భాగంగానే రాహుల్ గాంధీని పీకే కలిశారని వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో కొద్ది రోజుల క్రితం ప్రశాంత్ కిషోర్ రాహుల్ గాంధీని ప్రశంసించడం భవిష్యత్తు నేత రాహుల్ నే అంటూ వ్యాఖ్యలు చేయడం కూడా కొత్త రాజకీయ సమీకరణాలకు కారణంగా కనిపిస్తుంది. మరి వచ్చే సాధారణ ఎన్నికల నాటికి రాజకీయ వాతావరణం ఎలా మారుతుందో వేచి చూద్దాం.