కొత్త రేషన్ కార్డులొస్తున్నాయోచ్!

హైదరాబాద్ : కొత్త రేషన్ కార్డులు త్వరలో రాబోతున్నాయి. ఇప్పటికే దరఖాస్తులు చేసుకొని అర్హత పొందిన వారికీ కార్డులు అందనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాత కార్డుల తోనే రేషన్ ఇస్తున్నారు. ఆధార్ అనుసంధానంతో పలువురు లబ్ధిదారులకు రేషన్ కార్డులు ఎగిరిపోయాయి. వాటి స్థానంలో కొత్తవి ఇచ్చేందుకు ఆన్ లైన్ ఇబ్బందితో పలువురి పేర్లు నమోదు కాలేదు. వారికి చాలా కాలంగా రేషన్ అందడం లేదు. ఇక నుంచి పాత వారితో పాటు అర్హులైన కొత్తవారికీ రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

26 నుంచి కార్డుల పంపిణీ

ఈనెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ గంగుల కమలాకర్ ను ఆదేశించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకొని అర్హత పొందిన 3,60,000 పై చిలుకు లబ్ధిదారులకు ఆయా నియోజకవర్గాల్లోని మంత్రులు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే విధిగా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం తెలిపారు. జూలై 26 నుంచి 31 దాకా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు ఆగస్టు నెల నుంచే రేషన్ బియ్యం అందచేయాలని సీఎం స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను చేసుకోవాలని సివిల్ సప్లయ్ శాఖ కమిషనర్ శ్రీ అనిల్ కుమార్ ను సీఎం ఆదేశించారు.