అభివృద్ధి పనుల్లో కోమటిరెడ్డి తలమునకలు

హైదరాబాద్ : భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాల్లో తనమునకలు అవుతున్నారు. రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా ఎంపికైన అనంతరం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను గాంధీ భవన్ మెట్లు ఎక్కబోనని ప్రతినబూనారు. అనంతరం భువనగిరి, నల్లగొండ నియోజకవర్గాలకే పరిమితమవుతానని చెప్పారు.  ఆ మేరకు వరుసగా కేంద్ర మంత్రులతో  అభివృద్ధి పనుల విషయమై మంతనాలు సాగించారు. అధికారులతో వరుస సమావేశాలు జరుపుతూ పనుల విషయంలో చొరవ తీసుకుంటున్నారు.

ఈ మేరకు దరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై అండర్ పాస్ బ్రిడ్జిల నిర్మాణం త్వ‌ర‌గా చేప‌ట్టాల‌ని తాజాగా అధికారుల‌ను కోరారు. బుధవారం ఎన్ హెచ్ఏఐ సీజీఎం కృష్ణ ప్రసాద్‌, జీఎం నాగేశ్వరరావు, జీఎం కిషోర్ రఘునాథ్ ఫులేల‌తో భువనగిరి పార్లమెంటు పరిధిలోని వ‌రంగ‌ల్ – హైద‌రాబాద్, విజ‌య‌వాడ – హైద‌రాబాద్ జాతీయ ర‌హ‌దారుల‌పై అండ‌ర్ పాస్ బ్రిడ్జిల‌పై హైదరాబాద్ లోని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా రీజినల్ కార్యాలయంలో దాదాపు రెండున్నర గంటల పాటు సుదీర్ఘంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈనెల 19 నుంచి జ‌ర‌గ‌బోయే పార్ల‌మెంట్ స‌మావేశాల్లో ఈ స‌మ‌స్య‌ల‌ను లేవ‌నెత్తి స‌ర్కార్‌పై ఒత్తిడి తీసుకొచ్చి నిధులు తీసుకురావ‌డానికి కృషి చేస్తాన‌ని ఎంపీ చెప్పారు.

ఈ సందర్భంగా హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి నెంబ‌ర్‌ 65పై చౌటుప్ప‌ల్ వ‌ద్ద అండ‌ర్ పాస్ బ్రిడ్జికి రూ.50 కోట్లు,  పెద్ద‌కాప‌ర్తి వ‌ద్ద బ్రిడ్జికి రూ.20 కోట్లు, చిట్యాల్ బ‌స్టాండ్ వ‌ద్ద రూ.30 కోట్లతో అండ‌ర్ పాస్ బ్రిడ్జి, న‌ల్లగొండ ఎక్స్ రోడ్ వ‌ద్ద అండ‌ర్ పాస్ బ్రిడ్జికి రూ.30కోట్లు,  క‌ట్టంగూర్ రూ.7 కోట్లు, తిప్ప‌ర్తి రోడ్డు వ‌ద్ద న్యూ స‌ర్వీస్ రోడ్డుకు రూ.7కోట్లు, ఇనుపాముల వ‌ద్ద ఎక్స్‌టెన్ష‌న్ రూ.5.5 కోట్లు, టేకుమ‌ట్ల వ‌ద్ద‌ రూ. 40కోట్ల నిధులు మంజూరు అయ్యాయ‌ని తెలిపారు. క‌రోనా వ్యాప్తి కారణంగా ప‌నులు ప్రారంభం కాలేద‌ని కోమటిరెడ్డి వివ‌రించారు. వెంట‌నే నిర్మాణ ప‌నులు చేప‌ట్టాలని అధికారులను,  కాంట్రాక్ట‌ర్లను ఆదేశించారు.

జాతీయ ర‌హ‌దారి పొడవున పట్టణాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి కాబ‌ట్టి  ప‌నులు త్వ‌ర‌గా పూర్తిచేయాలని ఆదేశించారు. అధిక ట్రాఫిక్ వల్ల ఆయా ప్రాంతాల్లో ప్రజలు, ప్రయాణికులకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ నిర్మాణాలు త్వ‌ర‌గా పూర్త‌యితే ప్ర‌జ‌లకు ఇబ్బందులు త‌ప్పతాయ‌ని తెలిపారు.

అలాగే వ‌రంగ‌ల్ – హైద‌రాబాద్ నెంబ‌ర్ 163 పై అనంతారం వ‌ద్ద రూ.30 కోట్ల‌తో అండ‌ర్ పాస్ బ్రిడ్జి నిర్మాణం,  సింగ‌న్న‌గూడెం వ‌ద్ద రూ.30 కోట్ల బ్రిడ్జి,  అలాగే  రామ‌కృష్ణాపురం వ‌ద్ద మ‌రో రూ.30 కోట్ల‌తో బ్రిడ్జి నిర్మాణానికి డీపీఆర్‌లు సిద్ధం చేయాల‌ని సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. అలాగే జీడిక‌ల్ అండ‌ర్ పాస్ బ్రిడ్జికి రూ.29 కోట్ల నిధులు విడుద‌ల అయ్యాయని వివ‌రించారు. శుక్ర‌వారం క్షేత్ర‌స్థాయిలో పర్య‌టిస్తాన‌ని, ఆలోగా ప‌నులు ప్రారంభించాల‌ని ఆదేశించారు.