శృతిమించి పోతున్న కొన్ని యూట్యూబ్ వీడియోలపై మహిళాగ్రహం వ్యక్తమైంది. బరిగెగించిపోతున్న యూట్యూబర్లపై కన్నెర్రజేశారు. అర్ధరాత్రి, అపరాత్రి అని తేడా లేకుండా కొందరు మహిళలను ఓ ఆట వస్తువుగా చేసి ఆటాడుకుంటున్న వైనంపై ధ్వజమెత్తారు. మొత్తంగా శివాలెత్తి ఆ యూట్యూబర్ పై సినీ నటి కరాటే కళ్యాణితో పాటు కొందరు ఊరికిచ్చి కొట్టారు.
పైస్థాయిలో సరైన నిబంధనలు లేక, ప్రభుత్వాల అజమాయిషీ లేదని, స్వయం నియంత్రణ కోల్పోయిన కొందరు యూట్యూబర్లు ఇష్టారీతిన వీడియోలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ముఖ్యంగా మహిళలపై అసభ్య పదజాలంతో ప్రాంక్ వీడియోలు చేస్తున్నారు. దీనిపై అభ్యంతరాలు ఉన్నా ఎవరూ ఏమనలేక మిన్నకుండిపోతున్నారు.
అయితే కొన్ని విషయాల్లో డేర్ అండ్ డ్యాషింగ్ గా వ్యవహారించే సినీ నటి కరాటే కళ్యాణి స్పందించారు. యూ ట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి రాత్రి హైదరాబాద్ యూసఫ్ గూడ మధురానగర్ గల్లీలో ఉండగా కళ్యాణి అసభ్య, అంభ్యంతరకరమైన వీడియోలపై ప్రశ్నించారు. అతను మహిళల పట్ల వ్యవహరించే ప్రవర్తన, అసభ్య వీడియోలు చేస్తుండటంపై స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.
బట్టలూడదీసి కొట్టారు..
యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి బట్టలూడదీసి తరుముకుంటూ కళ్యాణి మరికొందరు కొట్టారు. మరోసారి ఇలాంటి అభ్యంతరకర వీడియోలు చేయొద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. ఓ దశలో కళ్యాణిపై కూడా ఆ యూటర్ దాడి చేశాడు. చంకన చంటిపిల్లతో ఉన్న ఆమె కింద పడింది. అయినా తెగువతో మహిళలు అతడిపై దాడి చేసి కొట్టారు. ఆ యూట్యూబర్ కూడా కళ్యాణిపై తీవ్రమైన పదజాలం వాడటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది.
కొందరు యూట్యూబర్లకు చెంపపెట్టు
అసభ్య పదజాలంతో, అభ్యంతరకరంగా మహిళల పట్ల వీడియోలు చేసే యూట్యూబర్లకు ఇదొక హెచ్చరిక లాంటిదేనని పలువురు అంటున్నారు. గతంలో ఎవరెన్ని వీడియోలు చేస్తున్నా ఎవరూ ఏమనలేకపోయారు. కానీ మహిళాగ్రహం వ్యక్తం కావడంతో మిగతా వారు సెటరైట్ అయ్యే పరిస్థితి వచ్చింది.
కళ్యాణి, యూట్యూబర్ ఇరువురూ ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.