ఈ చైర్మన్, వైస్ చైర్మన్ మాకొద్దు!

• చిల్లేపల్లి పీఏసీఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ పై మెజార్టీ డైరెక్టర్ల అవిశ్వాసం
• సూర్యాపేట డీసీవోకు 9 మంది డైరెక్టర్ల వినతి
• ధాన్యం అమ్మకాల్లో అవకతవకలపైనా కలెక్టర్ కు ఫిర్యాదు
• విచారణలో తాత్సారంపై మండిపాటు

నేరేడుచర్ల : సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలోని చిల్లేపల్లి పీఏసీఎస్ పాలకవర్గం వ్యవహారంపై మెజార్జీ డైరెక్టర్లు భగ్గుమంటున్నారు. గత కొన్నాళ్లుగా ప్రాథమిక సహకారం సంఘంలో జరుగుతున్న అవినీతి, అవకతవకలపై వారు చేస్తున్న ఆందోళనలో భాగంగా మరో అడుగు ముందుకేశారు. ఏకంగా చైర్మన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాసం తీర్మానం కోరుతూ సూర్యాపేట డీసీవోకు శుక్రవారం 9మంది డైరెక్టర్లు వినతిపత్రం అందజేశారు.

అదే విధంగా గత రబీలో ధాన్యం అమ్మకాల్లో జరిగిన అవకతవకలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ అదేరోజు కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. విచారణలో జరుగుతున్న తాత్సారంపై నిగ్గు తేల్చాలని కోరుతూ ఆ వినతిపత్రంలో వారు కోరారు.

బ్లాక్ మార్కెట్ కు యూరియా?
చైర్మన్, వైస్ చైర్మన్లు ఇద్దరూ కుమ్మక్కై గతంలో వచ్చిన యూరియాను సంఘం సభ్యులైన రైతులకు అందజేయకుండా ఇష్టానుసారంగా వేరే గ్రామాల రైతులకు ఇవ్వడమే కాకుండా, బ్లాక్ మార్కెట్ కు తరలించారని వారు ఆ వినతిపత్రంలో ఫిర్యాదు చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని డీసీవోను కోరారు.

అక్రమాలకు పాల్పడి, తాము సమావేశాల్లో పాల్గొన్న ఎజెండా సంతకాలను ఆమోదించినట్లుగా తమకు తెలియకుండానే పేర్కొనడంపై ధ్వజమెత్తారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

ధాన్యం కొనుగోళ్ల విచారణలో జాప్యమేల?
గత రబీ ధాన్యం కొనుగోళ్లలో జరిగిన అవకతవకలపై లోతైన విచారణ జరపాలని కలెక్టర్ కు 9మంది డైరెక్టర్లు మరో వినతిపత్రం అందజేశారు.

చైర్మన్, సీఈవో, రైస్ మిల్లుల యాజమాన్యాలకు అనుకూలంగా ఉన్నవారి ఖాతాల్లో నగదును మళ్లించి అవకతవకలకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సంఘం పరిధిలోని రైతుల నుంచి కాకుండా వేరే ప్రాంతాల రైతుల ఖాతాల్లో నగదు జమ చేయించి దానిని తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారని ఆరోపించారు.

బ్యాంకు లావాదేవీలు, రైతుల పేరున ఉన్న భూముల వివరాలను సమగ్రంగా పరిశీలించాలని వారు కోరారు. అవకతవకలు తేలితే వెంటనే చైర్మన్, సీఈవోలను విధుల నుంచి తొలగించి, అక్రమాలకు పాల్పడిన మిల్లర్లపై చట్టరీత్యా చర్యలు తీసుకొని, మిల్లులను సీజ్ చేస్తూ, అనుమతులను నిలిపేసి, సొసైటీ పరిధిలోని రైతులకు తగు న్యాయం చేయాలని చిల్లేపల్లి సొసైటీ పరిధిలోని మెజార్టీ డైరెక్టర్లు కలెక్టర్ ను కోరారు.