హీరో ఎన్టీఆర్ సొంతమైన అరుదైన రికార్డ్

తెలుగు చలనచిత్ర రంగంలో అగ్ర కథానాయకుల్లో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ అరుదైన రికార్డును సాధించి చరిత్రకెక్కారు. తాజాగా విడుదలై అభిమానులతో పాటు సినీ జనాల్లో హీట్ పుట్టిస్తున్న త్రిబుల్ ఆర్ సినిమా బంపర్ హిట్ సాధించడంతో ఆయనకు ఆ రికార్డు సొంతమైంది. నందమూరి వంశం నుంచి వచ్చినా, తెలుగు వెండితెర ఇలవేల్పు, నవరస నటనా సార్వభౌముడు ఎన్టీఆర్ వారసుడిగా అరంగేట్రం చేసినా తన సొంత ఇమేజ్ తో తన నటనా చాతుర్యంతో తనదైన నటకౌశలంతో గుర్తింపు తెచ్చుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. డైలాగ్ వెర్షన్ లో తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు ఆయన.

డబుల్ హ్యాట్రిక్ ధమాకా

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వరుసగా వచ్చిన ఆరు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు పొంది డబుల్ హ్యాట్రిక్ సాధించాయి. ఇలా అతికొద్ది మందికి మాత్రమే ఈ రికార్డు సొంతంకావడం విశేషం. అలాంటి అరుదైన డబుల్ హ్యాట్రిక్ సాధించి చరిత్రకెక్కారు జూనియర్ ఎన్టీఆర్. టెంపర్ సినిమాతో మొదలు నేటి త్రిబుల్ ఆర్ వరకు వరుసగా ఆయన ఆరు సినిమాలు ఒకదాన్ని మించి మరొకటిగా హిట్లు సాధిస్తూ రావడం మరో విశేషం.

టెంపర్ నుంచి పెరిగిన హీట్

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో బండ్ల గణేస్ నిర్మాతగా రూపొందిన టెంపర్ సినిమా అప్పట్లో బంపర్ హిట్ సాధించింది. ఈ సినిమా ఆనాడే రూ.75 కోట్లు వసూలు చేసి జూనియర్ ఎన్టీఆర్ స్టామీనాను ప్రూవ్ చేసింది.

రూ.100 కోట్ల క్లబ్బులో..

2016 జనవరిలో ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో నాన్నకు ప్రేమతో.. సినిమా విడుదలైంది. ఈ సినిమా రూ.125 కోట్లు వసూలు చేసింది. దీంతోనే జూ.ఎన్టీఆర్ రూ.100 కోట్ల క్లబ్బులో చేరాడు.

నట విశ్వరూపం

కొరటాల శివ దర్శకత్వంలో మల్టీస్టారర్ గా వచ్చిన జనతా గ్యారేజ్ సినిమాలో ఎన్టీఆర్ నట విశ్వరూపం ప్రదర్శితమైంది. దీనిలో మాస్, క్లాస్ మిలితమై అన్ని వర్గాలను ఆకట్టుకుంది. ఈ సినిమా రూ.135 కోట్లు వసూలు చేసి ఎన్టీఆర్ స్టామీనాను మరింత పెంచింది.

త్రిపాత్రాభినయం..

కేఎస్.రవీంద్ర దర్శకత్వంలో 2017లో జైలవకుశ సినిమా వచ్చింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంతో అలరించి, తన నటనా చాతుర్యాన్ని రుచి చూపించాడు. ఈ సినిమా రూ.150 కోట్లు వసూలు చేసి ఆయనకు మరింత బలాన్నిచ్చింది.

మరో ఎత్తు పెంచిన సినిమా

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 2018లో వచ్చిన అరవింద సమేత సినిమాతో ఎన్టీఆర్ ను మరో ఎత్తుకు నిలబెట్టింది. ఈ సినిమాతో రూ.165 కోట్లు వసూలై జూనియర్ ఎన్టీఆర్ స్టార్ డమ్ ను మరింత పెంచింది.

త్రిబుల్ ఆర్ తో బీట్

ఇలా వరుస సినిమాలతో ఒకదాన్ని మించి మరొకటిగా బ్లాక్ బస్టర్ హిట్లు సాధించాయి. వాటితో ఎన్టీఆర్ స్టామీనా కూడా పెరుగుకుంటూ వచ్చి, ఆయన స్టార్ డమ్ ను మరింత పెంచాయి. ఆర్ఆర్ఆర్ సినిమా తొలిరోజు రూ.200 కోట్ల వసూలు దాటడంతో వరుసగా వచ్చిన ఆరు సినిమాలు బంపర్ హిట్లు సాధించి డబుల్ హ్యాట్రిక్ రికార్డును బీట్ చేశాయి. ఇలా వరుస హిట్లతో ఆరు రికార్డులు సాధించి జూనియర్ ఎన్టీఆర్ చరిత్రకెక్కడం నిజంగా విశేషమే. ఆయన మరిన్ని విజయాలు సాధించి తాతకు తగ్గ మనవడిగా చరిత్రకెక్కాలని ఆశిద్దాం.