‘రామప్ప’లో నిట్ విద్యార్థుల సందడి

వెంకటాపూర్ : వెంకటాపూర్ మండలం పాలంపేటలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రామప్ప ఆలయంలో ఆదివారం వరంగల్ లోని నిట్ కళాశాల విద్యార్థులు సందడి చేశారు. ఏక్ భారత్, శ్రేష్ట్ భారత్ క్లబ్ ఆధ్వర్యంలో వారు ఆలయాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు రామప్ప ఆలయ చరిత్రను, సంస్కృతిని వివిధ కళా రూపాల ద్వారా వివరించారు. ఈ సందర్భంగా నిట్ వరంగల్ స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ ప్రొఫెసర్ రవికుమార్, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ వేణు వినోద్ మాట్లాడుతూ రామప్ప ఆలయానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు రావడం కోసం తమ కళాశాల రిటైర్డ్ ప్రొఫెసర్ పాండురంగారావు, ఎందరో పూర్వ విద్యార్థులు కృషి చేశారని తెలిపారు.

ఈ సందర్భంగా నిట్ వరంగల్ అలుమ్ని అసోసియేషన్ వరంగల్ చాప్టర్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. రామప్ప ఆలయ విశిష్టత, యునెస్కో గుర్తింపు, వివిధ అంశాలతో ఉన్న క్యాలెండర్ను ఆలయ అధికారులకు, అర్చకులకు అందచేశారు.

ఈ కార్యక్రమంలో నిట్ వరంగల్ ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ క్లబ్ ఇన్చార్జి డాక్టర్ శ్రీనివాస్ డాక్టర్ రాధసుధా, నిట్ వరంగల్ అలుమ్ని ఆసోసియేషన్ వరంగల్ చాప్టర్ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ ప్రొఫెసర్ కోలా ఆనంద్ కిషోర్, ట్రెజరర్ ప్రొఫెసర్ ఎస్ శ్రీనాథ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు వినోద్ లోక్ నాయక్, జి సురేందర్, స్టూడెంట్స్ కౌన్సిల్ ప్రతినిధి రాచమల్ల ప్రశాంత్, క్లబ్ విద్యార్థి ప్రతినిధులు యశోద, జీవన్ సాయి రెడ్డి, హరి తదితరులు పాల్గొన్నారు.