ఇదేందయా ఇది!?

ప్రపంచం 5జీ యుగంలోకి అడుగు పెట్టినా ఏదో ఓ మూలన ప్రజలను మూఢనమ్మకాల జాఢ్యం పట్టి పీడిస్తూనే ఉంది. దీనికి ఎందరో ప్రజలు ఇంకా వాటి బారిన పడుతూనే ఉన్నారు.

శాస్త్ర, సాంకేతిక రంగాలు ఎంతగా ఎదుగుతున్నా.. మూఢ నమ్మకాల వింత పోకడలు అంతగా పెరుగుతూనే ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. కొందరి అవసరాలను ఆసరా చేసుకున్న కొందరు ఉన్నది లేనిదీ చెప్తూ సొమ్ము చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. దోష నివారణ కోసం ఓ యువకుడి వింత పెళ్లి ఈ కోవకు చెందినదేనని పలువురు పేర్కొంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ వింత పోకడ తాజాగా బయటపడింది. కృష్ణ జిల్లా నూజివీడుకు చెందిన ఓ యువకుడికి ఇంట్లో వివాహ సంబంధాలు చూసేందుకు కుటుంబ సభ్యులు సిద్ధపడ్డారు. అయితే అతడి జాతకాన్ని పరిశీలించేందుకు ఓ జ్యోతిషుడిని సంప్రదించారు. ఆ యువకుడి జాతకంలో రెండు పెళ్లిళ్లు జరుగుతాయని జాతకంలో ఉందని ఆ జ్యోతిషుడు చెప్పాడట.

ఆ దోషం పోవాలంటే అతడికి మేకతో పెళ్లి జరిపిస్తే చాలని ఉచిత సలహా ఇచ్చాడట. దీంతో జాతకాలపై నమ్మకున్న ఆ యువకుడికి మేకతో వివాహానికి రెడీ చేశారు.

నూజివీడు పట్టణ పరిధిలోని నవగ్రహ ఆలయంలో ఆ యువకుడికి మేకతో ఉగాది రోజైన శనివారం పెళ్లి జరిగింది. అర్చకులు ఆ యువకుడితో శాస్త్రోక్తంగా మేక మెడలో మూడుముళ్లు వేయించారు.

మేకతో ఆ యువకుడికి పెళ్లి జరిగింది కాబట్టి ఇక మొదటి వివాహం జరిగినట్లేనని, మరో వివాహం చేసుకున్నా ఇబ్బందేమీ ఉండదని ఆ యువకుడు, వారి కుటుంబసభ్యులు భావిస్తున్నారు. మేకతో పెళ్లా.. అంటూ ముక్కున వేలేసుకొని ఆశ్చర్యపోవడం అక్కడి స్థానికుల వంతయింది.