తెలంగాణ @ లక్ష పెళ్లిళ్లు

• వివాహ బంధంతో ఒక్కటి కానున్న జంటలు
• శ్రీరామనవమి తర్వాత మహూర్తబలం

హైదరాబాద్ : ఎన్నో పెళ్లి జంటలు ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. చైత్ర, వైశాఖ మాసాలు అందుకు అనువుగా మారనున్నాయి. శ్రీరామనవమి దాటడమే తరువాయి. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే లక్షకు పైగా పెళ్లి బాజాలు మోగనున్నట్లు అంచనా.

45 రోజుల్లో..

కరోనా కారణంగా గత రెండేళ్లుగా శుభకార్యాల నిర్వహణకు జనం ఆసక్తి చూపలేదు. ముఖ్యంగా వివాహ ముహూర్తాలను చాలా మంది నిలిపేశారు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో వారు కోరుకున్నట్లుగా చైత్ర, వైశాఖ మాసాల్లోని సుమారు 45 రోజుల కాలంలో శుభ ముహూర్తాలు ఎన్నో ఉన్నాయని పండితులు తెలిపారు.

నవమి తర్వాత మే 25 వరకు శుభముహూర్తాలు

ఈనెల 10వ తేదీన శ్రీరామనవమి ఉంది. ఆ తర్వాత నుంచి మే నెల 25 వరకు పలు తేదీల్లో శుభ ముహూర్తాలు ఉన్నాయట. ఆయా తేదీల్లో ఒక్కటయ్యేందుకు ఎన్నో జంటలు ఎదురు చూస్తున్నాయి.

ఒక్కటి కానున్న లక్ష జంటలు

ఏప్రిల్, మే నెలల్లో తెలంగాణ వ్యాప్తంగా సుమారు లక్ష జంటలు వివాహ బంధంతో ఒక్కటి కానున్నట్లు ఒక అంచనా. ఒక్క హైదరాబాద్ నగరంలోనే సుమారు 40 వేల వరకు పెళ్లిళ్లు జరగనున్నట్లు పురోహితులు, ఫంక్షన్ హాళ్ల యాజమాన్యాల ద్వారా సేకరించిన సమాచారం.

ముందస్తుగా ఫంక్షన్ హాళ్ల బుకింగ్

శ్రీరామనవమి తర్వాత లగ్గాల కోసం ఇప్పటి నుంచే ఫంక్షన్ హాళ్లను బుక్ చేసుకుంటున్నారు. ఇప్పటికే పలుచోట్ల అడ్వాన్సులు కూడా ఇచ్చేసినట్లు తెలిసంది. కొన్నిచోట్ల ఏప్రిల్ పెళ్లిళ్లకు మార్చిలోనే బుకింగ్ అడ్వాన్సులు ఇచ్చేసినట్లు తెలిసింది. దీంతో ఫంక్షన్ హాళ్లకు డిమాండ్ పెరిగింది.

కొన్ని ఫంక్షన్ హాళ్లలో ఒకేరోజు రెండు వేర్వేరు ఫంక్షన్లకు బుకింగులు జరుగుతున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పెళ్లిళ్లు, సాయంత్రం రిసెప్షన్ కు బుకింగులు తీసుకుంటున్నట్లు తెలిసింది.

హైదరాబాద్ లో హోటళ్లలో బుకింగ్స్

హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున జరిగే వివాహ శుభకార్యాల సందర్భంగా ఇప్పటి నుంచి హోటళ్లలో గదులకు బుకింగులు జరుగుతున్నాయి. వచ్చే బంధుమిత్రుల కోసం ఇప్పటి నుంచే అడ్వాన్సులు ఇచ్చేస్తున్నారు. దీంతో హోటల్ గదుల కోసం పరుగులు తీస్తున్నారు.

20 రంగాల వారికి పనులు

పెళ్లిళ్లు అంటే సుమారు 20 రంగాల వారికి చేతినిండా పని దొరుకుతుంది. శుభలేఖలు, వస్త్ర దుకాణాల్లో సందడి నెలకొననుంది. ఫొటో, వీడియో గ్రాఫర్లు, పురోహితులు, మేకప్, బంగారు వ్యాపారులు, లైటింగ్, క్యాటరింగ్ సహా సుమారు 20 రంగాలకు చెందిన వారికి ఆయా శుభాకార్యాల సందర్భంగా పనులు దొరికి బిజీ కానున్నారు.