మునుగోడుపై టీఆర్ఎస్ నజర్

• ఉమ్మడి నల్లగొండలో ఏకైక కాంగ్రెస్ స్థానం
• ఈసారి ఎలాగైనా చెక్ పెట్టేందుకు వ్యూహం
• ముందస్తుగా క్యాండిడేట్ నిర్ణయానికి కసరత్తు
• కోదాడ, సాగర్ లా బీసీ ఫార్ములా అమలుకు ప్లాన్
• నారబోయిన రవి అభ్యర్థిత్వంపై అధిష్టానం సమాలోచన
• మంత్రి జగదీశ్ రెడ్డి ఆశీస్సులూ ఆయనకే..

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో 11 స్థానాల్లో ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ సారి దానినీ కైవసం చేసుకునేందుకు టీఆర్ఎస్ అధిష్ఠానం ప్లాన్ రెడీ చేసింది. ఈ మేరకు బీసీ నేత, మునుగోడు జడ్పీటీసీ స్వరూపారాణి భర్త నారబోయిన రవి అభ్యర్థిత్వాన్ని దాదాపు ఖరారు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.

రచ్చబండ ప్రత్యేక ప్రతినిధి : టీఆర్ఎస్ పార్టీ ముందస్తు ఎన్నికల కోసం వడివడిగా అడుగులు వేస్తోంది. ఆ మేరకు రాష్ట్రవ్యాప్తంగా వడపోతల కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐ ప్యాక్ సంస్థ ద్వారా రెండు దఫాలు సర్వేలు సైతం చేయించిందని తెలిసింది. పనిలో పనిగా ఇంటెలీజెన్స్ ద్వారా కూడా పలుమార్లు నివేదికలు తెప్పించుకుంది. ఆయా సర్వేలు, నివేదికల ఆధారంగా వడపోతల కార్యక్రమం కొనసాగుతోంది. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ముందస్తు అభ్యర్థుల జాబితా రెడీకి కూడా అధిష్ఠానం కసరత్తులు చేస్తున్నట్లు విశ్వసనీయం సమాచారం.

11 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 8 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన అభ్యర్థులే ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. మరో ముగ్గురు ఇతర పార్టీల నుంచి గెలుపొంది అనంతర పరిమాణాల్లో భాగంగా టీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 11కు చేరింది. మునుగోడు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొనసాగుతున్నారు.

మంత్రి కేటీఆర్ సమాలోచన!
మునుగోడు స్థానాన్ని కూడా తమ ఖాతాలో వేసుకునేందుకు టీఆర్ఎస్ పార్టీ ముందస్తుగా ప్లాన్ కు సిద్ధమైంది. దీనిలో భాగంగా ఇప్పటికే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మునుగోడు విషయమై జిల్లా మంత్రి గుంతకండ్ల జగదీశ్ రెడ్డితో సమాలోచనలు కూడా జరిపినట్లు సమాచారం. అక్కడున్న పరిస్థితులు, సామాజిక సమీకరణాలను సమీక్షించినట్లు తెలిసింది. నియోజకవర్గ నేతల బలాబలాలపైనా ఆరా తీసినట్లు తెలిసింది.

బీసీల ఓట్లే అధికం
మునుగోడు నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ముదిరాజ్, గౌడ్, యాదవ, పద్మశాలీ సామాజిక వర్గాల ఓట్లు అధికంగా ఉంటాయి. గత ఎన్నికల్లోనే బీసీ నేతకు టీఆర్ఎస్ టికెట్ ఇవ్వాలనే డిమాండ్ ఆయా వర్గాల నుంచి వచ్చింది. అయితే అనంతర పరిణామల్లో భాగంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రవేశంతో టీఆర్ఎస్ చేజార్చుకునే పరిస్థితి వచ్చింది.

ఈ సారి బీసీ నేతకే పట్టం?
ఈసారి ఎలాగైనా మునుగోడు స్థానాన్ని దక్కించుకోవాలంటే బీసీకే పట్టంగట్టాలని టీఆర్ఎస్ అధిష్ఠానం నిర్ణయించిందని తెలిసింది. ఈ మేరకు ఈ నియోజకవర్గం నుంచి ఎందరో పోటీలో ఉన్నా ముఖ్యంగా నారబోయిన రవితో పాటు మాజీ ఎమ్మెల్సీ, రాష్ట్ర నేత కర్నె ప్రభాకర్ పేర్లు అధిష్ఠానం పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అయితే కర్నె ప్రభాకర్ ను రాష్ట్ర స్థాయిలో అటు పార్టీకి గానీ, మరో పదవికి గానీ వినియోగించుకోవాలని పార్టీ యోచిస్తుందని తెలిసింది. ఈ దశలో ఇక మిగిలింది నారబోయిన రవి ఒక్కరే.

ఆ సర్వే నివేదికలూ రవి వైపే మొగ్గు?
ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలోని ఐప్యాక్ సర్వే సంస్థ, ప్రభుత్వ ఇంటెలిజెన్స్ నివేదికలు మునుగోడులో నారబోయిన రవి పేరునే ప్రధానంగా టీఆర్ఎస్ అభ్యర్థిగా సూచించినట్లు విశ్వసనీయ సమాచారం. మొదటి దఫాలోనే రవి పేరు ప్రముఖంగా వినిపించిందని, ఆ మేరకు మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి నారబోయిన రవికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు గుసగుసలు. ఆ మేరకే ఆయన నియోజకవర్గ వ్యాప్తంగా కలియదిరుగుతున్నట్లు క్యాడర్లో చర్చించుకుంటున్నారు.

ఊర్లను చుట్టేస్తున్న నారబోయిన రవి
ప్రధాన బీసీ సామాజిక వర్గానికి చెందిన నారబోయిన రవి సతీమణి స్వరూపారాణి ఇప్పటికే మునుగోడు జడ్పీటీసీగా కొనసాగుతున్నారు. దీంతో మండల వ్యాప్తంగా పట్టు సాధించిన రవి ఇతర మండలాలపై దృష్టి పెట్టారు. ఈ మేరకు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను చుట్టేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ కేడర్ కు అండగా ఉంటూ ఆత్మీయతలు పంచుతూ మంచి పేరు సంపాదించారు.

‘రవన్నా.. ఆ.. నేనున్నా..’
మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఏ ఊరిలో అయినా ఏ శుభకార్యం జరిగినా, ఎలాంటి ప్రమాదమైనా.. ఎవరికి ఏ ఆపద ఉన్నా.. రవన్నా.. అంటే.. నేనున్నా.. అంటూ అక్కడ వాలిపోతున్నాడు నారబోయిన రవి. శుభకార్యాలకు హాజరవుతూ వారిలో ఉత్తేజం కలిగిస్తున్నారు. బాధిత కుటుంబాలను పరామర్శిస్తూ వారికి తోచిన ఆర్థికసాయం అందిస్తూ బాసటగా నిలుస్తున్నారు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా వారి చెంతకు వెళ్తూ వారికి సాంత్వన చేకూరుస్తున్నాడు.

నారబోయిన రవి నేపథ్యం
మునుగోడు మండల కేంద్రానికి చెందిన నారబోయిన రవి తన సతీమణి స్వరూపారాణిని గత స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీటీసీ ఎన్నికల్లో గెలిపించుకున్నారు. బెంగళూరులో వ్యాపార రంగంలో స్థిరపడ్డారు. ఇప్పటికీ వ్యాపరంలో ఉన్న ఆయన గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.

మంత్రి గుంతకండ్ల జగదీశ్ రెడ్డి పిలుపుతో 2018లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆనాటి నుంచి నేటి వరకు ఇదే పార్టీలో కొనసాగుతున్నారు. ఈ దశలో నారబోయిన రవి అభ్యర్థిత్వానే టీఆర్ఎస్ అధిష్ఠానం ఖరారు చేసే అవకాశాలు మెండుగా ఉంది.