నల్లగొండ జిల్లాలో ఏసీబీకి చిక్కిన అవినీతి చేప

బ్రేకింగ్ న్యూస్.. బ్రేకింగ్ న్యూస్

ఏసీబీ అధికారులకు మరో అవినీతి చేప చిక్కింది. నల్లగొండ జిల్లాలో ఇటీవలే వివిధ చోట్ల కొందరు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. అదే వరుసలో ఎక్సైజ్ శాఖ అధికారి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా చిక్కడం కలకలం రేపింది.

నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ హిలకాలనీకి చెందిన నూకల విద్యాసాగర్ రెడ్డి, ఆయన భార్య లాటరీ పద్ధతిలో తిరుమలగిరి (సాగర్) మండలంలో వైన్ షాప్ దక్కింది. అయితే వైన్ షాప్ నడిచేందుకు నెలకు రూ.25 వేల చొప్పున ఇవ్వాలని ఎక్సైజ్ సీఐ యమునాధర్ రావు వారిని వేధించసాగాడు.

ఈ మేరకు బాధితుడు 8 నెలలకు గాను రూ.2 లక్షలు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. అనంతరం బాధితుడు మంగళవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. నల్లగొండ ఎక్సైజ్ స్టేషన్ వద్దకు వెళ్లి అక్కడ ఉన్న మరో సీఐ వాహనంలో నగదు పెట్టాడు. పథకం ప్రకారం వచ్చిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

నల్లగొండ జిల్లా హాలియా ఎక్సైజ్ సీఐ యమునాధర్ రావును అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా నగదు పెట్టిన సీఐ వాహనాన్ని కూడా అధికారులు సీజ్ చేశారు. అదే విధంగా సీఐ యమునాథర్ రావుకు చెందిన హైదరాబాద్ కొత్తపేట నివాసంలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు.